ప్రజావాణిలో ఉపకమిషనర్‌కు వినతిపత్రం అందజేత….గంగల రాధాకృష్ణ యాదవ్
శేరిలింగంపల్లి:
ఇజ్జత్‌నగర్ డివిజన్ పరిధిలోని శిల్పా హిల్స్, హైటెక్స్ ప్రాంతాల నివాసితులు ఎదుర్కొంటున్న పలు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం, శిల్పా హిల్స్ నివాసితులతో కలిసి మాదాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ సోమవారం మాధాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణని ప్రజావాణి కార్యక్రమంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను, ముఖ్యంగా మోండి కుంట చెరువు నుంచి ఇజ్జత్‌నగర్ బస్తీ వరకు రోడ్డు నంబర్ 2 మీదుగా ప్రవహిస్తున్న నాలా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నాలాను అనేక సంవత్సరాలుగా శుభ్రం చేయకపోవడంతో రోడ్డు నంబర్లు 2, 3, 4 ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని, వెలువడుతున్న విషవాయువుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
అంతేకాకుండా, నాలాపై ఉన్న అనేక స్లాబులు పగిలిపోవడంతో నాలా నుంచి వెలువడుతున్న దుర్వాసన నేరుగా పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంటూ, నాలాను తక్షణమే శుభ్రం చేయడంతో పాటు పగిలిపోయిన స్లాబులను మార్చి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు.
అదేవిధంగా, డ్రైనేజీ లీకేజీల నివారణ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, చెత్త తొలగింపు వంటి సమస్యలను కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు.
ప్రజల వినతిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ, సంబంధిత అధికారులను సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం, భద్రత, మెరుగైన మౌలిక సదుపాయాలు మా ప్రాధాన్యత. సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం. ముఖ్యంగా నాలా శుభ్రపరిచే పనులు, పగిలిపోయిన స్లాబుల మార్పిడి విషయంలో అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ ప్రజల పక్షాన కృషి చేస్తాం” అని తెలిపారు.
ప్రజావాణిలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలకు ఆదేశించిన డిప్యూటీ కమిషనర్‌కు శిల్పా హిల్స్ నివాసితులు, కృతజ్ఞతలు తెలిపారు.


