- -యువశక్తి దేశ నిర్మాణానికి దోహదపడాలి.. సైనికుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయం
- -వివేకానందుని స్ఫూర్తితో లక్ష్య సాధనకు ముందుకు సాగాలి
హైదరాబాద్:
పౌరులు తమ హక్కులతో పాటు విధులు, బాధ్యతలకు కూడా ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణ, జాతీయ చైతన్యంతో యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. సైనికుల త్యాగాలు, అమరవీరులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని పేర్కొన్నారు.
సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME) ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సైనిక ఇంజనీరింగ్, ఆధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రధాన కేంద్రంగా ఉన్న MCEMEలో ఈ జాతీయ సదస్సు జరగడం గౌరవంగా ఉందన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కాలేదని గవర్నర్ పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో భారత సైన్యం చేపట్టిన చర్యల అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని గుర్తుచేశారు.
గత 25 ఏళ్లుగా దేశభక్తి, క్రమశిక్షణ, జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేయడంతో పాటు మాజీ సైనికులు, దేశభక్తి గల పౌరులను ఏకతాటిపైకి తీసుకురావడంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు.
ప్రపంచవ్యాప్తంగా యువతలో వస్తున్న మార్పులకు ‘జెన్ జీ’ తరం ప్రతినిధిగా నిలుస్తోందని పేర్కొంటూ, యువశక్తి విధ్వంసం వైపు కాకుండా దేశ అభివృద్ధి, బలోపేతం వైపు పయనించాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’తో రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత, ఉత్పత్తుల పరంగా భారత్ పురోగమిస్తోందని గవర్నర్ అన్నారు. యూనిఫాం నుంచి విరమణ పొందినా దేశ సేవ నుంచి విరమణ కాదని, మాజీ సైనికుల అనుభవం దేశ నిర్మాణానికి విలువైనదని అన్నారు. సైనికులు, అమరవీరుల కుటుంబాల త్యాగాలు జాతీయ భద్రతకు పునాది అని పేర్కొన్నారు.
“దేశం మన కోసం ఏమి చేస్తుందనే దానికంటే.. మనం దేశం కోసం ఏమి చేయగలమనే ఆలోచన ముఖ్యం” అని గవర్నర్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ‘జై హింద్’ నినాదం కేవలం పలకరింపు కాదని, దేశభక్తి, ఐక్యత, ధైర్యం, అంకితభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
‘లేవండి.. మేల్కొనండి.. లక్ష్యం చేరే వరకు ముందుకు సాగండి’
స్వామి వివేకానందుని సందేశాన్ని గుర్తుచేస్తూ “లేవండి, మేల్కొనండి.. లక్ష్యాన్ని సాధించే వరకు ముందుకు సాగండి” అని గవర్నర్ పిలుపునిచ్చారు. దేశ సేవ, జాతీయ నిర్మాణం, దేశభక్తి స్ఫూర్తి ప్రతి పౌరుడిలో మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గవర్నర్ ఐదుగురు విశిష్ట సభ్యులకు ‘ఉత్కృష్ట దేశభక్తి పతకాలు’ ప్రదానం చేసి అభినందించారు.
కార్యక్రమంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ జాతీయ అధ్యక్షుడు, వీరచక్ర గ్రహీత కల్నల్ తేజేంద్ర పాల్ త్యాగి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాసరావు, విశ్వశాంతి కేంద్ర వ్యవస్థాపకుడు ఆచార్య లోకేష్, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, ఎయిర్ మార్షల్ రాహుల్ భాసిన్, ప్రొఫెసర్ నీలం పవార్, శ్రీ నరేంద్ర రామ్ నంబుల, శ్రీమతి అనురాధ రావు తదితరులు పాల్గొన్నారు.



