- కస్టమర్లపై హోటల్ సిబ్బందితో కలిసి దాడి..!
- స్టీల్ కడియంతో విచక్షణారహితంగా కొడితే ఒకరికి తీవ్ర గాయాలు..
- బాధితుడి జేబులోని రూ.25 వేల నగదు మాయం!
- హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని బాధితుడి ఆవేదన!
ఎల్బీనగర్
హోటల్‌కు భోజనం చేసేందుకు వెళ్లిన కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడికి దిగిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. బి.ఎన్. రెడ్డి నగర్‌లోని అతిథి బిర్యానీ సెంటర్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి స్టీల్ కడియంతో కొడితే తీవ్రంగా గాయపడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. భోజనం ఆలస్యమైందన్న చిన్నపాటి వాగ్వాదం చివరకు మూకుమ్మడి దాడి వరకు వెళ్లడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.. బాధితుడు బడేటి రమేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 8వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో తన స్నేహితులు మల్లేష్, శివ, రాకేష్‌లతో కలిసి అతిథి బిర్యానీ సెంటర్‌కు వెళ్లారు. ఆహారం సిద్ధం కావడానికి సమయం పడుతుందని సిబ్బంది చెప్పడంతో అక్కడే వేచి ఉన్నారు. ఈ క్రమంలో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.అనంతరం హోటల్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో అంజిబాబు, అతని కుమార్తె, అల్లుడితో పాటు మరికొందరిని పిలిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో మల్లేష్‌పై కడియంతో దాడి చేయడంతో కుడి కంటి పైభాగంలో, వీపు వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయని బాధితులు ఆరోపించారు. రమేష్ గౌడ్‌పై కూడా దాడి చేయడమే కాకుండా బీర్ బాటిల్‌తో కొట్టి చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
దాడితో ఆగని అరాచకం?
ఈ ఘర్షణలో బాధితులకు చెందిన మూడు మొబైల్ ఫోన్లు కిందపడగా, రెండు మాత్రమే తిరిగి లభించాయని, రమేష్ గౌడ్ జేబులో ఉన్న రూ.25 వేల నగదు సైతం కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన వారిని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు?
ఈ ఘటనలో స్టీల్ కడియంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినప్పటికీ, నిందితులపై వనస్థలిపురం పోలీసులు హత్యాయత్నం (అటెంప్ట్ టు మర్డర్) కేసు నమోదు చేయకుండా సాధారణ కేసు మాత్రమే నమోదు చేశారని బాధితుడు రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. దాడి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
హోటళ్లలో కస్టమర్ల భద్రత ప్రశ్నార్థకమేనా..?
భోజనం ఆలస్యమైందన్న కారణంతో మొదలైన వివాదం కత్తిపోట్ల దాడి, చంపేస్తామన్న బెదిరింపుల వరకు చేరిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హోటళ్లకు వెళ్లే సామాన్య కస్టమర్ల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, కేసు నమోదు చేసిన సెక్షన్లపై సమీక్షించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.



