Saturday, February 14, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్అమెరికా సరిహద్దుల్లో పెరుగుతున్న భారతీయుల అరెస్టులు… ఆందోళన కలిగిస్తున్న అక్రమ వలస ధోరణి

అమెరికా సరిహద్దుల్లో పెరుగుతున్న భారతీయుల అరెస్టులు… ఆందోళన కలిగిస్తున్న అక్రమ వలస ధోరణి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, యూఎస్‌ సరిహద్దుల్లో అరెస్టవుతున్న అక్రమ వలసదారుల సంఖ్యపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) వెల్లడించిన వివరాల ప్రకారం, రోజుకు సగటున 65 మంది భారతీయులు అమెరికా సరిహద్దుల్లో అరెస్టవుతున్నారు.

2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉండగా, గతేడాదితో పోలిస్తే మొత్తం అరెస్టుల సంఖ్య తగ్గినప్పటికీ… అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న వారిలో భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం.

ఉద్యోగాలు, మెరుగైన వేతనం, ఉన్నత జీవన ప్రమాణాల ఆశతో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేకుండా ప్రయాణిస్తున్న చిన్నారులు కూడా పట్టుబడుతుండటం అధికారులను కలవరపెడుతోంది.

అమెరికా సరిహద్దుల్లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ, అక్రమ వలసలు పూర్తిస్థాయిలో ఆగడం లేదని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా ముఠాలు (Human Trafficking Networks) ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకుంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, అక్రమంగా అమెరికా చేరేందుకు గతంలో మెక్సికో ప్రధాన మార్గంగా ఉండగా, 2025 నుంచి కొంతమంది కెనడా మార్గాన్ని ఎంచుకుంటున్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
“దుబాయ్‌, ఇస్తాంబుల్ వంటి దేశాల నుంచి మెక్సికో లేదా కెనడా మీదుగా యూఎస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ మార్గాల్లోనూ కఠిన ఆంక్షలు పెరగడంతో, కొందరు అత్యంత ప్రమాదకరమైన కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు” అని అధికారులు తెలిపారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అక్రమ ప్రయాణాలు ప్రాణాపాయానికి దారితీయడమే కాకుండా, అరెస్టులు, నిర్బంధం, డిపోర్టేషన్ వంటి పరిణామాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత అక్రమ మార్గాలను ఆశ్రయించకుండా, చట్టబద్ధమైన వీసా ప్రక్రియలను అనుసరించాలని పలువురు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments