- రాజకీయ పార్టీల పూర్తి సహకారం అడిగిన జిల్లా ఎన్నికల అధికారి
- బూత్ స్థాయి ఏజెంట్లు భాగస్వాములు కావాలి: జిహెచ్‌ఎంసి కమిషనర్ స్పష్టం
హైదరాబాద్:
రాబోయే ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, పక్కాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘విశేష నిశిత సవరణ (ఎస్‌ఐఆర్) – 2026’ ప్రక్రియను గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) వేగవంతం చేసింది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ (ఎన్నికలు) సంతోష్ కుమార్, జోనల్ కమిషనర్ చంద్రకళతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
*క్షేత్రస్థాయి పరిశీలన – శాస్త్రీయ దృక్పథం
సమావేశం సందర్భంగా నగరంలో ఓటర్ల వివరాల నమోదు, మార్పులు-చేర్పులు, తప్పుల సవరణలపై సమగ్రంగా చర్చించారు. నిశిత సవరణ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నామని, ప్రతి అర్హులైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే తమ ప్రాథమిక బాధ్యత అని అధికారులు వివరించారు. *ముఖ్యమైన సూచనలు:
*బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర: ప్రతి రాజకీయ పార్టీ తమ బూత్ స్థాయి ఏజెంట్లను ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడాలి.
*హడావిడికి తావులేకుండా: చివరి నిమిషంలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ముందుగానే దరఖాస్తు ఫారమ్‌లను నింపి సమర్పించేలా ఏజెంట్లు అవగాహన కల్పించాలి.
క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం శాస్త్రీయంగా, ప్రామాణికంగా ఉండేలా స్థానిక అధికారులతో ఏజెంట్లు సమన్వయం చేసుకోవాలి.
*క్షేత్రస్థాయి సహకారం అత్యవసరం
ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ విజయవంతం కావడానికి అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం మరియు పర్యవేక్షణ తోడైతేనే జాబితాలోని లోపాలను సులువుగా సవరించవచ్చని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను సరిచూసుకోవాలని, భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.



