- బ్యూరో క్రాట్స్ చేతిలో విలయతాండవం చేస్తున్న అవినీతి!
- ప్రజాధనానికి తూట్లు.. ప్రలోభాలకు దాసులు:
- లంచమే లభ్యం.. కొలువే లైసెన్సుగా మారిన వైనం.. కుప్పకూలుతున్న ప్రజాస్వామ్య విలువలు!
- కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతిపక్షాలపై దృష్టి పెట్టాలంటూ గగ్గోలు పెడుతున్న తెలంగాణ సమాజం..
ఓత్ ఆఫ్ ఎలిజియన్స్: విస్మరించిన ప్రభుత్వ ఉద్యోగి రాజ్యాంగం పట్ల నిబద్ధతతో విధులు నిర్వర్తించాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాణ స్వీకార వచనాలను గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వ కొలువును అందినకాడికి దండుకునే లైసెన్సుగా భావిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.
రెవెన్యూ, మున్సిపల్, వైద్య , న్యాయ శాఖల్లో లంచగొండితనం తారస్థాయికి చేరింది. 2024లో 154 కేసులు నమోదు కాగా, 2025 నాటికి అవి 199కి పెరిగాయి. ఏసీబీ గణాంకాలే ఈ వ్యవస్థీకృత లోపానికి నిదర్శనం. ప్రజాధనానికి తూట్లు పొడుస్తున్న ఈ అవినీతి తిమింగలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి, సమగ్ర ప్రక్షాళనకు నడుం బిగించాలి.
పరిశోధనాత్మక పాత్రికేయులు.. మీ.. వి.జి…
హైదరాబాద్
రాజ్యాంగం పట్ల నిబద్ధతతో, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తమ ప్రమాణ స్వీకార వచనాలను గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దొరికితే భగవంతుడు సంపాదన కోసం ఇచ్చిన లైసెన్సుగా భావిస్తూ, అందినకాడికి దండుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ అవినీతి విలయతాండవం చేస్తోంది.
*శాఖలవారీగా ప్రక్షాళన కరవు.. బ్రష్టు పడుతున్న వ్యవస్థలు
మున్సిపల్, రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, న్యాయశాఖ తదితర ప్రతి ప్రభుత్వ శాఖలోనూ అక్రమాలు తారస్థాయికి చేరాయి. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన యంత్రాంగం, స్వలాభాపేక్షతో లంచాలకు పెద్దపీట వేస్తోంది. నాసిరకం ఆహార సరఫరా నుంచి పేదలకు అందాల్సిన వైద్య, విద్య అందక సామాన్యులు విలవిలలాడుతున్నారు. అకౌంటబిలిటీని పూర్తిగా విస్మరించిన కొందరు అధికారులు, నిజాయితీగా పనిచేసే తోటి ఉద్యోగులను అపహాస్యం చేసే స్థాయికి దిగజారారు. ధనిక రాష్ట్రంగా వెలుగొందాల్సిన తెలంగాణ, నేడు అప్పులపాలు కావడంలో ఈ అధికారుల అవినీతి పాత్ర కూడా ఎంతో ఉందనే ఆరోపణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

తెలంగాణలో ఏసీబీ దాడులలో పట్టుబడ్డ అధికార గణం:, గణాంకాలు మరియు సమగ్ర పరిశీలన:
2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ పాలన, పారదర్శకత మరియు అవినీతి నిరోధక శాఖ (ACB) పనితీరు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనాన్ని అణచివేయడానికి అవినీతి నిరోధక శాఖ మరియు ఇతర నిఘా విభాగాలు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయి.
గణాంకాల రూపంలో తీవ్రత :(2024 – 2025)
అధికారిక నివేదికల ప్రకారం, రాష్ట్రంలో అవినీతి వ్యతిరేక చర్యలు ఏ విధంగా ఊపందుకున్నాయో క్రింది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి:
2024 సంవత్సరం: ఈ ఏడాదిలో సుమారు 154 కేసులు నమోదు కాగా, వివిధ శాఖలకు చెందిన 223 మంది ప్రభుత్వ అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు.
2025 సంవత్సరం: ఈ సంఖ్య మరింత పెరిగి, ఏకంగా 199 కేసులు నమోదయ్యాయి. వివిధ స్థాయిలలో లంచాలు తీసుకుంటూ పట్టుబడిన మరియు అక్రమాస్తులు కూడబెట్టిన 273 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే సుమారు 22.4 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ తంతు వృద్ధుని పెంచుకుంటూ రేపు వచ్చే సంవత్సరానికి 40 శాతానికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని సామాజిక విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు..
*ప్రజా ద్రోహమే పరమార్థంగా.. మేల్కొనాల్సిన సమయం ఆసన్నం
రిటైర్మెంట్ నాటికి ఎంత సంపాదించామనే పోటీ పడుతున్న ఈ దుస్థితి సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ అవినీతి ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే, వ్యవస్థలు మరింత పాతాళానికి పడిపోవడం ఖాయం. ఇది కేవలం పాలనా వైఫల్యం మాత్రమే కాదు, ప్రత్యక్షంగా దేశ జీడీపీపైనా, ప్రజాస్వామ్య మూలాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. గురజాడ అడుగుజాడల్లో నడవాల్సిన పాలకులు, ‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులనే గుర్తుంచుకో’ అన్న స్ఫూర్తిని మరుస్తున్న వైనంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



