- బేఖాతరు ధోరణికి చరమగీతం: జీహెచ్‌ఎంసీ ప్రజావాణిలో అధికారులపై ఉక్కుపాదం!
- సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు తప్పవు: అగ్రనేతల హెచ్చరిక
హైదరాబాద్:
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ముగిసింది. ప్రజల నుంచి వస్తున్న అర్జీలను నామమాత్రంగా స్వీకరించి కాలయాపన చేస్తున్న క్షేత్రస్థాయి అధికారుల తీరుపై నగరపాలక సంస్థ అత్యున్నత యంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలనా పక్షవాతాన్ని ప్రక్షాళన చేసే దిశగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ తో పాటు విజిలెన్స్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగాల ఉన్నతాధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
*హెడ్‌క్వార్టర్స్‌పైనే ప్రజా ఆగ్రహం: అదుపుతప్పిన యంత్రాంగం
ఈ విడత ప్రజావాణిలో మొత్తం 60 ఫిర్యాదులు నమోదు కాగా, ఇందులో సింహభాగం నేరుగా ప్రధాన కార్యాలయంపైనే రావడం అధికార వర్గాలలో కలకలం రేపింది. జోన్ల వారీగా చూస్తే శంషాబాద్ జోన్ నుంచి అత్యధికంగా 09, సికింద్రాబాద్ జోన్ నుంచి 05, రాజేంద్రనగర్ జోన్ నుంచి 03, మరియు చార్మినార్ జోన్ నుంచి 02 ఫిర్యాదులు అందాయి. గోల్కొండ, ఖైరతాబాద్ జోన్లలో సున్నా ఫిర్యాదులు నమోదు కావడంపై పరిపాలనా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నగర నడిబొడ్డున ఉన్న ప్రధాన కార్యాలయం పరిధిలోనే ఏకంగా 41 ఫిర్యాదులు పేరుకుపోవడం, కిందిస్థాయి వ్యవస్థలు ఎంతగా భ్రష్టుపట్టాయో అద్దం పడుతోంది.
*శాస్త్రీయ దృక్పథం లోపమే ప్రజల కష్టాలకు మూలకారణం
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న పౌర సమస్యలకు అధికారుల అశాస్త్రీయ ప్రణాళికలే ప్రధాన కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఎలాంటి క్షేత్రస్థాయి పరిశోధన లేకుండా, కేవలం టేబుల్ సర్వేలకే పరిమితమవుతున్న టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ విభాపాల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేలా అనుమతులు ఇస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీకి చట్టబద్ధమైన గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాల్సిందేనని ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. దస్త్రాల కదలికలో జాప్యం జరిగినా, బాధ్యతారహితంగా వ్యవహరించినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదులను కేవలం కాగితాలకే పరిమితం చేస్తే, రాబోయే రోజుల్లో కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగంలో వణుకు మొదలైంది.



