హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓసారి ఇటువైపు చూడటానికి టైం లేదా..? ఓపిక లేదా..?
సర్వే నెం. 681/1/3, శంకరపల్లిలో వెలుగు చూసిన అక్రమం..
లంచాల మత్తులో జోగుతున్న నార్సింగి మున్సిపల్ అధికారులు
అంతులేని అవినీతి చరిత్రను రాసుకున్న నార్సింగి మున్సిపల్ కమిషనర్, టిపిఓలు..
ఈ వ్యవహారంపై స్పెషల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి దృష్టి సారిస్తారా..?
111 జీవోలో 10 ఎకరాలలో “కే కన్వెన్షన్ హాల్” అక్రమ నిర్మాణం.
నాలా కన్వర్షన్ లేదు.. పైగా అది ప్రభుత్వ భూమి.. నిస్సిగ్గుగా కబ్జా..
నార్సింగి మున్సిపల్ అనుమతులు లేవు.. ఓ కుంటను కూడా మింగేశారు,
ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు లక్షల్లో మామూళ్ళు
ఎస్.టి.ఎఫ్ ఇంచార్జ్ కలెక్టర్, మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి…
నార్సింగి మున్సిపాలిటీలో అవినీతి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది… ప్రభుత్వ అధికారులం మనకు అడ్డేముంది అన్న అహంకారంతో అవినీతిని ఆలవాలంగా చేసుకుని అధికారులు పనిచేస్తుంటే ఇలాంటి అధికారులను డబ్బుతో కొనేసి అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.. ప్రభుత్వానికి దక్కాల్సిన పన్నును దోచుకుంటున్నారు… పూర్తిగా ప్రకృతి వైవిద్యానికి విగాథం కలిగిస్తూ.. చెరువులను మింగేశారు.. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు.. ఈ విషయంపై రాతపూర్వక ఫిర్యాదు చేస్తే.. స్పందించకపోవడం వెనుక అంతర్యం ఏమిటో ప్రభుత్వ ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి.. కే కన్వెన్షన్ నిర్మాణం దీనికి ప్రతీకగా నిలుస్తోంది..
ప్రజల హక్కులను కాపాడటానికి ప్రభుత్వాధికారులు పనిచేస్తారు.. కానీ కాపాడాల్సిన వారే కాటేస్తే పరిస్థితులు ఎంత దారుణంగా వుంటాయో చెప్పనవసరం లేదు.. ఇప్పుడు అలాండి దారుణ పరిస్థితి వార్మింగ్ మున్సిపాలిటీలో తాండవం చేస్తోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు అవినీతి దుప్పటి కప్పుకుని, లంచాల మత్తులో జోగుతూ అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తులను దోచేస్తున్నారు. ప్రజల కష్టాన్ని నీరుగారుస్తున్నారు… చట్టం, న్యాయం, నిబంధనలు అనే పదాలను చెరిపేస్తూ…. పర్యావరణాన్ని చిదిమేస్తూ, కోట్ల రూపాయల భూములను కొందరు దుర్మార్గులు కబ్జా చేస్తూ దౌర్జన్యానికి తెరలేపుతుంటే… అడ్డుకోవాల్సిన అధికారులు వారి చెప్పులు నాకుతున్నారు.. కే కన్వెన్షన్.. అక్రమ నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తోంది…
గండిపేట జలాశయాన్ని ఆనుకుని ఉన్న బయో కన్జర్వేషన్ జోన్ అంటే 111 జీఓ పరిధిలోని శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, జన్నాడ గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమంగా ఆక్రమించబడి “కే కన్వెన్షన్ హాల్” పేరుతో భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతోంది. సర్వే నంబర్లు 725/1,680,680/1.681, 707లలో ఉన్న భూములు ఈ అక్రమానికి కేంద్రంగా మారాయి. ఈ ప్రాంతం గండిపేట సరస్సుకు సమీపంలో ఉండడం వల్ల ఇది పర్యావరణ పరిరక్షణ జోన్లోకి వస్తుంది… అంటే ఇక్కడ నిర్మాణాలు పూర్తిగా చట్టవిరుద్ధం.
పది ఎకరాలు… ఎవడబ్బసొమ్మని ఆక్రమించారు..?
ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్ను చెల్లించకుండా నాలా కన్వర్జన్ పేరుతో వ్యవసాయ భూమిని కమర్షియల్ మార్చి అక్రమంగా ఫంక్షన్ హాల్, రిసార్ట్ నిర్మాణం చేపట్టారు. లంచాలతో కప్పేసిన భ్రష్టాచారం ఇది… ఎన్ని ఫిర్యాదులు చేసినా.. సాక్ష్యాలతో కథనాలు వెలువరించినా అధికారులు మాత్రం లంచాల మత్తులో ముగుతూ ఏమీ తెలియనట్లు నాటకాలు వేస్తున్నారు. అసలైన సమాచారం ప్రకారం, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, ఇరిగేషన్ అధికారులు లక్షలో ముడుపులు తీసుకుని ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యంగా ప్రోత్సహిస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రజల ఫిర్యాదులు. ఫైళ్లలో దాగిపోయాయి.. ఆ ఫైళ్లపై లంచాల బరువు నిలిచిపోయింది.. నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కమిషనర్’ కి రాతపూర్వక ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాక, అ అధికారి స్వయంగా ఈ ఆక్రమ నిర్మాణం వెనుక ఉన్నారని స్థానిక ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు కూడా ముడుపులు తీసుకుని కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.
నిర్లక్షపు నీడలో ప్రభుత్వం.. పండుగ చేసుకుంటున్న అక్రమార్కులు..:
ఇటు పర్యావరణానికి తీవ్ర విఘాతం. అటు ప్రభుత్వానికి పన్ను నష్టం.. కొన్న అమాయకుల జీవితాలు బుగ్గిపాలు .. వీటన్నిటినీ పట్టించుకోకుండా ఈ నిర్మాణాలు. కొనసాగుతుండటం ప్రభుత్వ వ్యవస్థ పతనానికి దారి తీస్తోంది అనడానికి నిదర్శనం… “ప్రభుత్వ భూమిని కాపాడాల్సినవారే కబ్జాకు సహకరిస్తే ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది?” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల డిమాండ్:
‘మేము చేసిన ఫిర్యాదులకు స్పందన లేదు. అధికారులే ఈ అవినీతికి తలమానికంగా మారారు. కే కన్వెన్షన్ పేరుతో జరుగుతున్న ఆశ్రమ నిర్మాణాలను వెంటనే ఆపి, సంబంధిత అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి’ అని స్థానిక ప్రజలు మున్సిపల్ అధ్యక్ష స్థాయి అధికారి ఎస్ శ్రీనివాస్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు… మది ఆయనైనా ఈ అక్రమాన్ని అడ్డుకుంటారా? వేచి చూడాలి…


