కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. సుమారు కోటీ పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన కమిషన్ (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రంజన ప్రకాశ్ దేశాయ్ ఈ కొత్త వేతన సంఘానికి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగియనుంది. ఆ తర్వాతి దశలో కొత్త వేతన సవరణ అమలు చేయడానికి ముందస్తు చర్యగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 8వ పే కమిషన్‌పై ప్రాథమిక ప్రకటన చేసింది. అనంతరం వివిధ మంత్రిత్వ శాఖలతో, విభాగాల ప్రతినిధులతో, సిబ్బంది సంఘాలతో కేంద్రం విస్తృతంగా చర్చలు జరిపింది. ఇప్పుడు అధికారికంగా 8వ పే కమిషన్ ఏర్పాటు ప్రక్రియకు కేబినెట్ మోదీ నేతృత్వంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కమిషన్‌లో ఒక ఛైర్‌పర్సన్, ఒక పార్ట్‌టైమ్ సభ్యుడు, ఒక సభ్య కార్యదర్శి ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లోగా తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. కొత్త వేతన సవరణ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వేతన సంఘం అంటే దేశంలోని సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారుల వేతనాలు, భత్యాలు, సేవా షరతులు ఎంత ఉండాలో నిర్ణయించే కీలక వ్యవస్థ. దేశ ఆర్థిక పరిస్థితులను, ద్రవ్యోల్బణాన్ని, ప్రస్తుత జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంఘం సవరణలపై సిఫార్సులు చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జీతాలు, పెన్షన్లను సవరించి ప్రకటిస్తుంది.
ఈ నిర్ణయంతో కేంద్ర ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు వేతన సవరణ ద్వారా జీతాల్లో గణనీయమైన పెరుగుదల ఆశిస్తున్నారు. కొంతమంది ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 నుంచి 4.0 వరకు పెరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారిక వివరాలు కమిషన్ సిఫార్సుల తర్వాత మాత్రమే వెల్లడవుతాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరోవైపు, కేంద్రం ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాలు కేంద్ర వేతన సవరణ నమూనాను అనుసరించే విధానం కొనసాగిస్తున్నందున, రాష్ట్ర ఉద్యోగుల వేతనాల సవరణ కూడా భవిష్యత్తులో చర్చకు రావచ్చని భావిస్తున్నారు.


