సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామ రైతులు ధాన్యం తరలింపునకు లారీలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట–మెదక్ 765 హైవేపై తిమ్మపూర్ వద్ద రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయినా లారీలు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వర్షాల భయంతో ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన నెలకొందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను ఏర్పాటు చేసి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న దుబ్బాక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దీంతో గంటపాటు రోడ్డుకిరువైపులా వాహనాల నిలిచిపోగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఈ ధర్నాలో వేముల రాజేశం, రుద్రారం యాదగిరి, మార్కంటి నరేష్, బొమ్మ కనకరాజు, భీమరి బాపురాజ్, కండ్లకొయ్య హరీష్, నవీన్, ముక్కపల్లి సాగర్, ఈదన్న అశోక, ఇరమల్లు సుబ్బు, వేముల కనకయ్య, ధరణి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


