ఈ విషయంలో రాజీ పడవద్దు..
పిలుపునిచ్చిన బీ.ఆర్.ఎస్. అధినేత కేసీఆర్..
తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరుకావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలన్నారు. బీఆర్‌ఎస్‌పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు కొట్లాడాలన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు.. విడుదల చేయకపోవడం గురించి.. వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రజా సమస్యలపై ఎండగట్టాలన్నారు. దళితబంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలన్నారు. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్‌ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సభలో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ సభ్యులు, మండలి సభ్యులు పాల్గొన్నారు