దేశ రాజధాని దిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయాలనే కుట్రను పోలీసులు సమయానికి భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఐఎస్ఐఎస్ (ISIS) ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నిఘా సమాచారం ఆధారంగా దిల్లీ సూపర్ సెల్ పోలీసులు రాజధానిలోని సాదిక్ నగర్ ప్రాంతంలో, అలాగే మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు.
అరెస్టైన వారిలో ఒకరు భోపాల్‌కు చెందిన అద్నాన్, మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో వీరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని, దిల్లీలో పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు వెల్లడైంది.
పోలీసులు నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు సమాచారం కోసం వారిని ప్రశ్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
వారి మొత్తం నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు దిల్లీ పోలీసుల ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిసింది.


