Friday, August 21, 2026
Google search engine
Homeతెలంగాణనల్లధనం, కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి సాంకేతిక విద్య!

నల్లధనం, కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి సాంకేతిక విద్య!

జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలి..

జీవో నంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు ఉరితాళ్లు – ‘ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’, టి.ఎస్.టి.సి.ఏ, కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ తీవ్ర హెచ్చరిక

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 97 నిరుపేద విద్యార్థుల పాలిటెక్నిక్ విద్యకు ఉరితాడుగా మారింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను పీపీపీ విధానం కింద కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ద్వారా, సాంకేతిక విద్యను సమాధి చేసే కుట్ర జరుగుతోంది. దీనివల్ల ఈసెట్ (ECET) ప్రవేశాలు, ఎస్‌బీటీఈటీ స్వయంప్రతిపత్తి పూర్తిగా ప్రశ్నార్థకమై, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుంది. ప్రజాధనంతో నిర్మించిన కళాశాలలను కొల్లగొట్టే ఈ అనాలోచిత జీవోను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి.

హైదరాబాద్:

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల పాలిటెక్నిక్ సాంకేతిక విద్యను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 97 రాష్ట్రంలో విప్లవాత్మక అగ్గిని రాజేస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానం కిందకు మార్చడం ద్వారా, దశాబ్దాలుగా నిరుపేద విద్యార్థులకు అందుతున్న శాస్త్రీయ సాంకేతిక విద్యను సమాధి చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ‘ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’, టి.ఎస్.టి.సి.ఏ, కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ సంయుక్త సంస్థలు..తీవ్రస్థాయిలో భుజమిత్తాయి…

*ఈసెట్ (ECET) ప్రవేశాలకు ముప్పు – నిరుపయోగంగా మారనున్న డిప్లొమా!
శాస్త్రీయ మరియు అకడమిక్ నిబంధనల ప్రకారం, పాలిటెక్నిక్ అనేది ఒక క్రమబద్ధమైన సాంకేతిక డిప్లొమా కోర్సు. ఈ విద్యనభ్యసించిన విద్యార్థులు ఈసెట్ (ECET) ప్రవేశ పరీక్ష ద్వారా నేరుగా ఇంజనీరింగ్ (బీటెక్) ద్వితీయ సంవత్సరంలోకి (లేటరల్ ఎంట్రీ) ప్రవేశం పొందుతున్నారు. అయితే, జీవో 97 కారణంగా ఈ డిప్లొమా సర్టిఫికెట్ల చట్టబద్ధత, విలువ పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు మూడు సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు నిరుపయోగమై, వారి ఇంజనీరింగ్ ఉన్నత విద్యకు తీవ్ర విఘాతం కలగనుంది.

*ఎస్‌బీటీఈటీ (SBTET) స్వయంప్రతిపత్తికి తూట్లు
ఇప్పటివరకు ‘స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్’ (SBTET) పరిధిలో స్పష్టమైన అకడమిక్ క్యాలెండర్, పకడ్బందీ పరీక్షల విధానంతో పాలిటెక్నిక్ విద్య నడుస్తోంది. దీనిని ‘శక్తి’ (SHAKTI) శాఖ కిందకు లేదా ప్రైవేట్ భాగస్వామ్య సంస్థల పరిధిలోకి మార్చడం ద్వారా సాంకేతిక విద్యామండలి స్వయంప్రతిపత్తి పూర్తిగా దెబ్బతింటుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) నిబంధనలకు విరుద్ధంగా సిలబస్, పరీక్షలు, రెగ్యులేషన్స్‌లో తీవ్రమైన గందరగోళం ఏర్పడి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది.

*ప్రభుత్వ భూములు, ప్రయోగశాలల కొల్లగొట్టే కుట్ర!
ప్రజాధనంతో దశాబ్దాలుగా నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూములు, భవనాలు, అత్యాధునిక ప్రయోగశాలలు మరియు కోట్ల విలువైన పరికరాలను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకే ఈ జీవో తెచ్చారని ‘ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ ఆరోపించింది. కార్పొరేట్ చేతుల్లోకి కళాశాలలు వెళితే ఫీజులు విపరీతంగా పెరిగిపోయి, కేవలం ధనవంతులకే తప్ప పేద విద్యార్థులకు సాంకేతిక విద్య పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది.

*శాంతియుత నిరసనలపై లాఠీచార్జ్ అప్రజాస్వామికం
తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు పాశవికంగా లాఠీచార్జ్ చేయడం అత్యంత హేయమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫోరం పేర్కొంది. విద్యార్థుల ఆందోళనలను అణచివేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబుకే విద్యార్థి ఉద్యోగ సంఘాల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

*తక్షణ డిమాండ్లు:

  • విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న జీవో నంబర్ 97ను వెంటనే బేషరతుగా రద్దు చేయాలి.
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రస్తుత స్వరూపాన్ని, SBTET గుర్తింపును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు.
  • ఈసెట్ (ECET) లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ ప్రవేశాలకు, ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగదని ప్రభుత్వం రాతపూర్వక స్పష్టమైన హామీ ఇవ్వాలి.
    ఈ ప్రభుత్వ అనాలోచిత చర్యలను విరమించుకోకపోతే, విద్యార్థి లోకాన్ని ఏకం చేసి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ‘ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ టి.ఎస్.టి.సి.ఏ, కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ సంయుక్త సంస్థలు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments