Wednesday, July 22, 2026
Google search engine
Homeతెలంగాణనిరుపేదల సొంతింటి కల నిజం: వచ్చే ఏటా కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు!

నిరుపేదల సొంతింటి కల నిజం: వచ్చే ఏటా కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు!

  • *తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల గృహాల నిర్మాణం
  • *నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ – ఆగస్టు 10 వరకు గడువు
  • *రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల విలువైన స్థలం మహిళల పేరిట ఉచిత రిజిస్ట్రేషన్

హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని నగర పరిధిలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగు వేసింది. నగర పరిధిలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో, నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరో 8 నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు. పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు ఈ ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సోమవారం నాడు సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల సమాచార పత్రం, దరఖాస్తు విధానాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పథకం పేరును సామాజిక మాధ్యమాల ద్వారా సహేతుకంగా వివరించిన నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందిన కొండా నాగరాజుకు రూ.లక్ష నగదు బహుమతిని అందించి సత్కరించారు.

*లబ్ధిదారులకు లభించే ప్రయోజనాలు – నిబంధనలు
ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, పేదలకు గరిష్ట లబ్ధి చేకూరేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
*ఉచిత స్థలం – రిజిస్ట్రేషన్: పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల వైశాల్యంలో, సుమారు రూ.40 లక్షల నుండి రూ.60 లక్షల విలువైన స్థలాన్ని గృహిణుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఈ ఇంటిని పదేళ్ల వరకు విక్రయించడానికి వీలుండదు. అయితే బ్యాంకుల నుండి రుణం పొందేందుకు తాకట్టు పెట్టుకునే వెసులుబాటు కల్పించారు.

*ఆర్థిక సహాయం – వాటాల వివరాలు: ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, అందులో రూ.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీ (ఉచితంగా) రూపంలో భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుని వాటాగా నాలుగు విడతల్లో ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది.
*రిజర్వేషన్లు: ఇళ్ల కేటాయింపులో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి.
*దరఖాస్తు రుసుము:
దరఖాస్తు సమయంలో చెల్లించే రూ.10 వేలను లబ్ధిదారుని వాటాలో మినహాయిస్తారు. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే ఆ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.

*అర్హతలు: లబ్ధిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. నగర పరిధిలో సొంత స్థలం కానీ, ఇల్లు కానీ ఉండకూడదు. ఒక కుటుంబం నుండి ఒకే దరఖాస్తును స్వీకరిస్తారు.

*దరఖాస్తు విధానం – పారదర్శక ఎంపిక
ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 21 నుండి ఆగస్టు 10 వరకు ప్రభుత్వ సేవా కేంద్రాలు, నిశ్చిత సమాచార సంఖ్య (8096958096), అధికారిక అంతర్జాల వేదికల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాజకీయాలకు అతీతంగా, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి స్థలాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీల పరిధిలో సమగ్రంగా వడపోస్తారు. అర్హులు ఎక్కువగా ఉంటే అందరి సమక్షంలో బహిరంగంగా లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లను కేటాయిస్తారు. ప్రతి ఇంట్లో ఒక పడకగది, హాలు, వంటగది ఉంటాయి.

*శరవేగంగా నిర్మాణాలు – మధ్యతరగతికీ శుభవార్త!
నగరంలో బోనాల జాతర జరుగుతున్న శుభసందర్భంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వచ్చే ఏడాది కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే పేద మహిళలతో బోనాలు ఎత్తించేలా శరవేగంగా పనులు పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నగరానికి 30-35 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల పేదలు అక్కడ నివసించలేకపోయారని, అందుకే ఇప్పుడు వారుండే చోటే ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమానికి వెనకడుగు వేయబోమన్నారు. అలాగే, త్వరలోనే మధ్యతరగతి ప్రజల గృహ అవసరాలకు సంబంధించి కూడా ఒక శుభవార్త అందిస్తామని మంత్రి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో గృహనిర్మాణ పథకం ఒక చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. నగర పరిధిలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించడం అభినందనీయమని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.

*తొలి విడతలో ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రాంతాలు:
1.రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి
2.మహేశ్వరం: జల్పల్లి
3.శేరిలింగంపల్లి:రాయదుర్గం
4.ఇబ్రహీంపట్నం: తట్టిఅన్నారం, బండ్లగూడ
5.మల్కాజిగిరి: కౌకూర్

  1. నాంపల్లి: రెడ్‌హిల్స్, నీలోఫర్ ఆసుపత్రి సమీప రక్షకభట నివాసాలు (పోలీస్ క్వార్టర్స్)
    7.ఖైరతాబాద్: హకీంపేట్ దర్గా, జూబ్లీహిల్స్ శాసనసభ్యుల నివాస సముదాయం (ఎమ్మెల్యే కాలనీ)
    8.కార్వాన్: కుల్సుంపురా సమీప రక్షకభట నివాసాలు
    9.బహదూర్‌పురా: నందిముసలిగూడ
    10.అంబర్‌పేట్: నగర రక్షకభట నివాసాలు (సిటీ పోలీస్ లైన్స్)
    11.కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ నివాస సముదాయం
    12.మేడ్చల్: పోచారం ఎల్‌ఐజీ నివాస సముదాయం
    13.కుత్బుల్లాపూర్: గాజులరామారం
    14.సనత్‌నగర్: పాటిగడ్డ
    15.సికింద్రాబాద్ కంటోన్మెంట్: మారేడ్‌పల్లి – మహేంద్రహిల్స్
    16.మలక్‌పేట్: గడ్డిఅన్నారం రహదారులు-భవనాల శాఖ నివాస సముదాయం (ఆర్ అండ్ బీ క్వార్టర్స్)
    ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, శాసనసభ్యులు దానం నాగేందర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్, శ్రీగణేష్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, జాఫర్ హుస్సేన్, ముబీన్, గృహనిర్మాణ శాఖ నిర్వాహక సంచాలకులు (ఎండీ) వి.పి. గౌతమ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments