Wednesday, August 12, 2026
Google search engine
Homeతెలంగాణనిషేధిత భూముల వేదనకు చరమగీతం!

నిషేధిత భూముల వేదనకు చరమగీతం!

  • ’22-ఏ’ ఉచ్చు వీడాల్సిందే.. అర్హులకు సర్కార్ భరోసా!
  • తప్పు చేస్తే సహించేది లేదు.. సబ్-రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు సంకెళ్లు
  • ఆగస్టు 14లోగా డాక్యుమెంట్లన్నీ ఆన్‌లైన్ చేయాలని మంత్రి పొంగులేటి అల్టిమేటం.

హైదరాబాద్:

దశాబ్దాల తరబడి నిరుపేదల నెత్తిపై కత్తిలా వేలాడుతున్న నిషేధిత భూములు, ‘పీఓబీ/22-ఏ’ (POB / 22-A) చట్టపరమైన ఉచ్చుకు తెరపడింది. గత పాలకుల అనాలోచిత విధానాలు, సృష్టికర్తలకంటే అధికారుల విచక్షణాధికారాల ముసుగులో సాగిన దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడింది. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా సహించేది లేదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గర్జించారు. సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, అక్రమార్కుల భరతం పడుతూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

*కొత్త నిషేధం లేదు.. పాత చిక్కులకే చరమగీతం!
ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్క భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన చట్టపరమైన తప్పులు, సాంకేతిక చిక్కులతో సతమతమవుతున్న నిజమైన బాధితులకు ఊరట కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. అగ్రికల్చర్, నాన్-అగ్రికల్చర్, పీఓబీ జాబితాల సమ్మేళనంలో జరిగిన లోపాల వల్ల సామాన్యుల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్న వైనంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాకోణంలో ఆలోచించి, కలెక్టర్లు యుద్ధప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.

*విచక్షణాధికారాల చెక్‌పోస్ట్.. ఆన్‌లైనే ప్రామాణికం!
భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోలు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ అనుమతులు తదితర సమస్త డాక్యుమెంట్లను ఈనెల 14వ తేదీలోగా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

  • ఫోర్జరీ, బోగస్ డాక్యుమెంట్‌లకు చెక్ పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశం.
  • సబ్-రిజిస్ట్రార్ల చేతిలో ఉన్న విచక్షణాధికారాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
  • ఆన్‌లైన్‌లో ఏది స్పష్టంగా ఉంటే, దానికి ఆమోదం తెలపడమే రిజిస్ట్రార్ల విధి అని, అదనపు అధికారాల ప్రదర్శనకు స్వస్తి పలకాలని హెచ్చరించారు.
  • పారదర్శకత కోసం పహానీ రికార్డులను కూడా సబ్-రిజిస్ట్రార్లకు అందుబాటులోకి (Access) తెస్తున్నట్లు తెలిపారు.

*తహశీల్దార్లకు బై-బై.. నేరుగా కలెక్టర్లకే దరఖాస్తులు!
పీఓబీ జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను గుడ్డిగా తిరస్కరించడానికి వీలులేదని మంత్రి తేల్చిచెప్పారు. తిరస్కరణకు బలమైన కారణాలను మూడు రోజుల్లోగా వివరిస్తూ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై పీఓబీకి వచ్చే ప్రతి దరఖాస్తును తహశీల్దార్లకు పంపకుండా, నేరుగా జిల్లా కలెక్టరుకే పంపాలని స్పష్టం చేశారు. కేవలం కలెక్టర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మధ్య మాత్రమే ఉత్తరప్రత్యుత్తరాలు జరగాలని నిర్దేశించారు.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఏ చిన్న లొసుగును వదిలిపెట్టినా, అక్రమాలకు పాల్పడినా కఠినమైన చర్యలు ఉంటాయని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్షమించే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments