- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు
- గవర్నర్ శివప్రతాప్ శుక్లా*
- 632 మంది ఎస్సెస్సీ టాపర్లకు రూ.2.27 కోట్ల ప్రోత్సాహకాలు
హైదరాబాద్:
పదో తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని.. ఉన్నత లక్ష్యాల వైపు సాగేందుకు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, కష్టపడి వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు, వనరుల కొరత అడ్డంకులు కావని స్పష్టం చేశారు.
హైదరాబాద్ హైటెక్‌సిటీలోని శిల్పకళావేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన ‘మిషన్ 10వ తరగతి–రివార్డ్ అండ్ రికగ్నిషన్’ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 632 మంది ఎస్సెస్సీ టాపర్లకు సుమారు రూ.2.27 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తున్న శ్రీరామ్ గ్రూప్‌ను గవర్నర్ అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. “మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారో మీ కలలకు అది పరిమితి కాకూడదు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి తాను అనుకున్నది సాధించగలడు” అన్నారు. విద్యతోపాటు జిజ్ఞాస, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ చదవాలని, ప్రశ్నలు అడుగుతూ నిరంతరం నేర్చుకోవాలని చెప్పారు.
తమ విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోవద్దని గవర్నర్ సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత తమ పాఠశాలలకు, సమాజానికి తిరిగి సేవ చేయాలని ఆకాంక్షించారు.
“పెద్ద కలలు కనండి.. కష్టపడి పనిచేయండి.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణకు పేరు తీసుకురండి” అని విద్యార్థులకు గవర్నర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ క్యాస్పర్స్ జె.హెచ్. క్రామ్హౌట్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వి.ఎన్. రెడ్డి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎంఓ డా. వరుణ్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు


