Friday, November 20, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్‘మూడు సర్కిళ్లు.. ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు’.. ఒక్క లిఫ్టుకు దిక్కులేదు!

‘మూడు సర్కిళ్లు.. ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు’.. ఒక్క లిఫ్టుకు దిక్కులేదు!

  • మెట్ల ముందు ‘కన్నీటి’ నిరీక్షణ.. లిఫ్టులో ‘ప్రాణ’ సంకటం!
  • ఎల్బీనగర్ జోన్ సర్కిల్ 12,13,14 కార్యాలయంలో మెట్లెక్కలేక దివ్యాంగులు, వృద్ధుల కన్నీటి పర్యంతం
  • రెండేళ్లుగా మరమ్మతుల పేరుతో కాలయాపన..
  • సుగమ్య భారత్ నిబంధనలకు తూట్లు.. పైఅంతస్తులకు వెళ్లలేక వృద్ధులు, గర్భిణుల నరకయాతన
  • పాతది తొలగించి కొత్త లిఫ్టు ఏర్పాటుకు స్థానికుల డిమాండ్

ఎల్బీనగర్

ఎల్బీనగర్ జోన్ మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని సరూర్నగర్ ప్రాంతంలో ఉన్న 12,13,14 కార్యాలయంలో ప్రయాణ ఎలివేటర్ (లిఫ్టు) పనిచేయకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. సరూర్‌నగర్ (12), ఎల్బీనగర్ (13), హయత్‌నగర్ (14) సర్కిల్ కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న ఈ బహుళ అంతస్తుల భవనంలోకి ప్రతిరోజూ వేలాది మంది సామాన్య ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆసరా పింఛన్లు, పట్టణ ప్రణాళిక, ఆస్తి పన్ను విభాగాల సేవల కోసం పైఅంతస్తులకు వెళ్లాల్సి రావడంతో, మెట్లెక్కలేని అభాగ్యులు కిందనే నిలబడి కన్నీరు పెడుతున్నారు.

రెండేళ్ల క్రితం అమర్చిన ఈ నూతన ఎలివేటర్ నాసిరకం కావడంతో పాటు, కనీస నిర్వహణ లేక పూర్తిగా తుప్పు పట్టి ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యపై దినపత్రికల్లో పలుమార్లు కథనాలు ప్రచురితమైనప్పుడల్లా అధికారులు మొక్కుబడి మరమ్మతులు చేయించి చేతులు దులుపుకుంటున్నారు. బాగు చేసిన రెండు రోజులకే యంత్రం మళ్లీ మొరాయిస్తుండటంతో, మధ్యలో ఇరుక్కుపోయిన సందర్శకులు భయాందోళనలతో కేకలు వేస్తూ ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ కార్యాలయంలో వంద మందికి పైగా సిబ్బందితో పాటు ముగ్గురు ఉప కమిషనర్లు, ముగ్గురు ఉన్నత స్థాయి సాంకేతిక ఇంజనీర్లు , పదిమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఒక చిన్న ఎలివేటర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

సుగమ్య భారత్ అభియాన్ నిబంధనలు, 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ భవనాల్లో దివ్యాంగులు, వృద్ధుల రాకపోకలకు సురక్షితమైన ఎలివేటర్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి.
అంతేకాకుండా, నిర్మాణ సాంకేతిక ప్రమాణాల ప్రకారం తుప్పు పట్టి, తరచూ మొరాయించే పాత యంత్రాలకు తాత్కాలిక మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలు, యాంత్రిక వైఫల్యాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఒక మెట్టు ఎక్కేటప్పుడు మోకాళ్ల కీళ్లపై శరీర బరువు కంటే మూడు నుండి నాలుగు రెట్లు అధిక ఒత్తిడి పడుతుందని వైద్య శాస్త్ర అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కీళ్ల నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు మూడు, నాలుగు అంతస్తుల మెట్లు ఎక్కడం వారి ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతోంది.

తరచూ మరమ్మతులకు గురవుతూ ప్రాణసంకటంగా మారిన ఈ పాత యంత్రాన్ని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో నాణ్యమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త ఎలివేటర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే మండల కమిషనర్ వికాస్ మహాతో, మల్కాజిగిరి నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ విషయంపై తక్షణమే ప్రత్యేక దృష్టి సారించి, నూతన ఎలివేటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి తమ కష్టాలను తీర్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments