Thursday, September 3, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్: సీ.ఎం. రేవంత్ రెడ్డి.

రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్: సీ.ఎం. రేవంత్ రెడ్డి.

  • ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ప్రగతికి శంఖారావం..
  • రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీ.ఎం భేటీ.

ఢిల్లీ:

భారతదేశ సార్వభౌమత్వాన్ని, రక్షణ సామర్థ్యాలను అజేయంగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తున్న రక్షణ రంగానికి తెలంగాణను ప్రధాన కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ మరియు ‘రక్షణ ఎక్స్‌పో-2026’ సదస్సులను జాతీయ స్థాయిలో విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక సదస్సులకు ముఖ్య అతిథిగా హాజరై, రక్షణ ప్రదర్శనను ప్రారంభించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు.
దేశ ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక ప్రగతిలో రక్షణ రంగం పోషిస్తున్న పాత్రను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణను ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సదస్సును రూపకల్పన చేసింది. ఢిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, గౌరవ పార్లమెంటు సభ్యులు ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్ తదితరులు పాల్గొని రాష్ట్ర ప్రయోజనాల సాధనలో తమ నిబద్ధతను చాటుకున్నారు.

*అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ ఎక్స్‌పో-2026
భారతదేశ రక్షణ రంగ స్వయం సమృద్ధిని, దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించే లక్ష్యంతో డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రక్షణ ఎక్స్‌పో-2026 దేశ రక్షణ చరిత్రలోనే మైలురాయిగా నిలవనుంది. ఈ సదస్సులో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సాంకేతిక గ్యాలరీలు, అత్యాధునిక వైమానిక విన్యాసాలు (ఎయిర్‌షో), పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనలు, భూతల రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ పరిశ్రమలు, నూతన ఆవిష్కరణల స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పెద్దఎత్తున భాగస్వామ్యులై తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ ఎక్స్‌పో అపూర్వ వేదికను కల్పిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి ఈ వేదికను ప్రారంభించి దిశానిర్దేశం చేస్తే, దేశ యువతకు, రక్షణ పరిశోధకులకు అపారమైన స్ఫూర్తి లభిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.

*త్రివిధ దళాల భాగస్వామ్యంతో వైమానిక విన్యాసాలు
తెలంగాణ గడ్డపై జరగనున్న ఈ రక్షణ ప్రదర్శనను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విజయవంతం చేయడానికి రక్షణ శాఖ సమగ్ర సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు సత్వరం మంజూరు చేయాలని కోరారు. భారత వైమానిక దళానికి (IAF) చెందిన అత్యుత్తమ విమానాలతో పాటు, ప్రఖ్యాత ‘సూర్యకిరణ్’, ‘సారంగ్’ ఏరోబాటిక్ విన్యాస బృందాలు ఈ ప్రదర్శనలో పాల్గొనేలా తగు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.
అదేవిధంగా, స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనను ఏర్పాటు చేయడంతో పాటు, భారత భూ, నౌకా, వైమానిక దళాలకు (Army, Navy, Air Force) చెందిన అత్యాధునిక ఆయుధ రక్షణ వ్యవస్థలను ప్రజల ముందుంచాలని కోరారు. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, వ్యూహాత్మక నిపుణులు ఈ సదస్సులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

*హెచ్‌ఏఎల్, డీఆర్‌డీవో భాగస్వామ్యంతో స్వదేశీ సాంకేతికత ప్రదర్శన
దేశ రక్షణ రంగాన్ని ఆత్మనిర్భరత వైపు నడిపిస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఈ సదస్సులో సంపూర్ణంగా పాలుపంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), మజ్‌గాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) వంటి ప్రసిద్ధ ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, డీఆర్‌డీవో (DRDO)కు చెందిన అనుబంధ ప్రయోగశాలలు స్వదేశీ రక్షణ సాంకేతికతను విస్తృతంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. విదేశీ రక్షణ శాఖల ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ రాయబారులు, అంతర్జాతీయ రక్షణ పరిశ్రమల ప్రముఖులతో ప్రత్యేక వ్యాపార సమావేశాలు (B2B Meetings) నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

*ఆదిలాబాద్ విమానాశ్రయానికి 1500 ఎకరాల భూ కేటగిరీకి అంగీకారం
ఉత్తర తెలంగాణ ప్రాంత పారిశ్రామిక, రవాణా, వ్యూహాత్మక అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ విమానాశ్రయ పునరుద్ధరణ మరియు విస్తరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూ సేకరణను పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రక్షణ శాఖ భవిష్యత్తు అవసరాల నిమిత్తం మొత్తం 1500 ఎకరాల భూమిని కేటాయించాలని కోరిన నేపథ్యంలో, మిగిలిన మరో 750 ఎకరాల భూమిని కూడా సేకరించి తక్షణమే అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.

*దేవరకద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు నామమాత్రపు లీజుతో భూ కేటాయింపు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (DRDO/DRDL) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక రక్షణ పరిశోధన ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 416.18 ఎకరాల విశాలమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIIC) ఇప్పటికే అధికారికంగా అంగీకారం తెలిపిందని సీఎం వెల్లడించారు.

పారిశ్రామికాభివృద్ధిని, శాస్త్రసాంకేతిక పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎకరాల లెక్కన కాకుండా, మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం ఒక్క రూపాయి (రూ. 1) నామమాత్రపు లీజు అద్దె ప్రాతిపదికన 33 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రాతిపదికన ఈ భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ప్రాజెక్టు అవసరాలను బట్టి ఈ లీజు కాలాన్ని మరో రెండు పర్యాయాలు పొడిగించుకునే వెసులుబాటును కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణలో రక్షణ రంగానికి అగ్రపీఠం వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతున్న తీరుకు కేంద్ర రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించడం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments