- ప్రజలకు గవర్నర్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..
హైదరాబాద్
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విశిష్ట కృషి, రాజ్యాంగ సభ సభ్యుల అంకితభావం, దూరదృష్టి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసాయని గవర్నర్ పేర్కొన్నారు.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప ఆదర్శాలని, ఇవి దేశ ఐక్యత, సమగ్రత, ప్రగతికి మార్గదర్శకాలని తెలిపారు. రాజ్యాంగం మన హక్కులకు భరోసా కల్పించడంతో పాటు దేశం పట్ల విధులు, బాధ్యతలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలపై విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయాలని, ముఖ్యంగా యువత రాజ్యాంగ ఆదర్శాలను ఆచరణలో పెట్టి ప్రాథమిక విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
రాజ్యాంగ స్ఫూర్తితో న్యాయబద్ధమైన, సమ్మిళిత, సామరస్యపూర్ణ, సంపన్న భారతదేశాన్ని నిర్మించి వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.
గవర్నర్ ను కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నెరెళ్ల శారద, కమిషన్ సభ్యురాలు శ్రీమతి ఉజ్మా ఆషాయి షాకిర్ బుధవారం హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. రాష్ట్ర మహిళా కమిషన్ పనితీరును గవర్నర్ కు వివరించారు.
అంతకుముందు ఆర్ బీవీఆర్ ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష బిష్ట్ , 78వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ (2025) కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ ప్రొబేషనర్లు శ్రీ హర్ష్ దబారియా, కుమారి ఎన్. చేతనా రెడ్డి లతో కలిసి గవర్నర్ ను కలిశారు.


