భారీగా బంగారం, వెండి సొత్తుతో పాటు స్విఫ్ట్ కారు స్వాధీనం
మల్కాజ్ గిరి:
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దొంగగా మారిన ఘటన మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది.నేరేడ్‌మెట్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు అతని వద్ద నుండి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 20వ తేదీన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో తాళాలు పగలగొట్టి భారీ దొంగతనం జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాలు సిసిటివి (CCTV) ఫుటేజీలను, సాంకేతిక ఆధారాలను కూలంకషంగా పరిశీలించాయి.ఈ దర్యాప్తులో పెండ్యాల శ్రీనివాస్ (31) అనే సాఫ్ట్‌వేర్/ప్రైవేట్ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు తిరుమలగిరి ఎక్స్ రోడ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
నిందితుడి నుంచి పోలీసులు ఈ క్రింది సొత్తును స్వాధీనం చేసుకున్నారు: 429.92 గ్రాముల బంగారు ఆభరణాలు 2,974 గ్రాముల వెండి వస్తువులు
దొంగతనానికి ఉపయోగించిన ఇనుప రాడ్,ఒక గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్
చోరీ సొత్తును తరలించడానికి ఉపయోగించిన తెల్లటి మారుతి సుజుకి స్విఫ్ట్ కారు (AP16CW8883)
నిందితుడు దొంగతనం చేసిన సొత్తులో కొంత భాగాన్ని ఇప్పటికే గుంటూరు, హైదరాబాద్‌లలో విక్రయించి జులాయిగా ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన నేరేడ్‌మెట్ పోలీస్ బృందాన్ని పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యేకంగా అభినందించారు.


