20 సంఘాలు మద్దతు ప్రకటించాయి..
అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులతో వెలిచాల స్పష్టం..
గత పాలకవర్గాల హాయంలో అర్బన్ బ్యాంకు అద్వాన స్థితికి చేరుకుందనీ, అస్తవ్యస్తంగా మార్చారనీ, మాకు అవకాశం ఇస్తే బ్యాంకును సమూలంగా ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు. నీతి నిజాయితీతో మీ ముందుకు వచ్చిన మా ప్యానల్ అభ్యర్థులకు అర్బన్ బ్యాంకు మెంబర్లు మార్పు కోసం ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గురువారం సాయంత్రం ప్రైవేట్ హోటల్లో బ్యాంక్ ప్యానల్ అభ్యర్థులతో కలిసి రాజేందర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా అర్బన్ బ్యాంకు ను ఏ విధంగా తయారు చేస్తామనే అంశంపై ఒక మేనిఫెస్టో ను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకు పాలకవర్గాలు, బ్యాంకు అభివృద్ధి కోసం దోహదపడాలి కానీ వారి సొంత లాభం కోసం చూసుకున్నారనీ, బ్యాంకును ఏ మాత్రం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 8 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని, మళ్ళీ వారే మాకు అధికారం కావాలని ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధి ఏమోగానీ ప్రతిష్టను దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గోల్డ్ పేట రోల్డ్ గోల్డ్ పెట్టి రుణాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో మార్పు కోసం కాంగ్రెస్ భావాజాలం,వ్యక్తిత్వం సామాజిక సేవ, నిజాయితీ వంతంగా, జ్ఞానం, పరిజ్ఞానంతో ప్యానెల్ ను ఏర్పాటు చేశానని తెలిపారు. సేవా భావం, ఎలాంటి లాబాపేక్ష లేకుండా పనిచేసేందుకు ముందుకొచ్చిన నిర్మల భరోసా ప్యానల్ ను గెలిపించాలని కోరారు.
కరీంనగర్ లోనీ 20 సంఘాలు లారీ అసోసియేషన్, ఆటోనగర్ అసోసియేషన్, హమాలీ సంఘం పద్మశాలి సంఘం, కాపు సంఘం, రెడ్డి సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, గౌడ సంఘం, ఐఎంఏ డాక్టర్ల సంఘం బార్ అసోసియేషన్ సంఘాలు తమ ప్యానెల్ కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో మా తండ్రి జగపతిరావు పాత్ర గణనీయంగా ఉందన్నారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని ఆయన ఆశయ సాధనకు తాను అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో 18 వేల మెంబర్లతో నడిచిన అర్బన్ బ్యాంకు నేడు 9000 పరిమితమైందని బ్యాంకును మొత్తం లోపభూయిష్టంగా మార్చి వేశారని పారదర్శకతకు పాతర వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.ఖాతాదారులను చేర్పించడం మర్చిపోయారని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్ రెడ్డిలు ఇరువురు ఆరోపణలు చేసుకొని బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ప్యానల్ అభ్యర్థులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు ,విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నామని రాజేందర్రావు పేర్కొన్నారు. బ్యాంకును సంస్కరిస్తామని ఆన్లైన్లో లావాదేవీలు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ చేపడుతామనీ, ఖాతాదారులకు సత్వరమే సేవలందించేలా చూస్తామన్నారు. హుస్నాబాద్, హుజురాబాద్ జమ్మికుంట, చొప్పదండి లో కొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తామన్నారు. 72 కోట్లు ఉన్న డిపాజిట్లను వచ్చే మూడేళ్లలో 200 కోట్లు డిపాజిట్ చేరుకునేలా బ్యాంకు ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
58 కోట్ల అడ్వాన్సులను 150 కోట్లకు చేరుకునేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మల భరోసా ప్యానల్ కు స్వచ్ఛందంగా వివిధ సంఘాలు గురువారం మద్దతు తెలిపాయని రాజేందర్రావు పేర్కొన్నారు. వారు ముందుకొచ్చి మద్దతు తెలుపడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలోఅభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఇ లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రాజేందర్, ఆకుల నరసన్న, కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల స్వామి గౌడ్, అనంతుల రమేష్, బట్టు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


