- *టీడీఆర్ గుట్టురట్టు: నకిలీ పత్రాల వెనుక ఉన్నతాధికారుల హస్తం?
- *మౌలిక వసతుల ముసుగులో భూదోపిడీ; అసలు యజమానులకు దక్కని హక్కులు; ‘బిల్డ్ నౌ’ వెబ్ సైట్ పారదర్శకతపై అనుమానాలు!
- ఎల్బీనగర్ జోన్ లో టి.డి.ఆర్ భారీ అవినీతి జరిగినట్లు అనుమానాలు..!
- మున్సిపల్ శాఖ విజిలెన్స్ ఏసీబీ నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి..!
- మున్సిపల్ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి, దృష్టి సారించాలి..
భాగ్యనగరంలో రోడ్ల విస్తరణ పేరుతో సాగుతున్న భూసేకరణ, ‘బదిలీ చేయగల అభివృద్ధి హక్కుల’ (టీడీఆర్) బాండ్ల జారీ వ్యవహారం చివరకు ‘అధికారుల జేబులు నింపే’ హక్కుగా రూపాంతరం చెందింది. నకిలీ పత్రాలు, తప్పుడు బిల్లులను క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే పసిగట్టలేకపోయిన మన ‘కంటిచూపు’ లేని సబ్ రిజిస్ట్రార్లు, సర్వేయర్ల పుణ్యమా అని రూ. 5.78 కోట్ల ప్రజాధనం దర్జాగా పక్కదారి పట్టింది. కృత్రిమ మేధస్సుతో తీసుకొచ్చిన కొత్త ‘బిల్డ్ నౌ’ వెబ్ సైట్ పారదర్శకతను పెంచాల్సింది పోయి, అక్రమార్కులకు ఒక ‘చీకటి తెర’గా మారింది. ఎఫ్ఎస్ఐ నిబంధనల మార్పుల వెనుక సాగుతున్న రూ. 600 కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్ కుట్రలు, వ్యవస్థలోని లూప్‌హోల్స్‌ను చూస్తుంటే.. టీడీఆర్ అంటే ‘టౌన్ ప్లానింగ్ డెవలప్మెంట్’ కాదు, అధికారుల ‘టాప్ డిగ్రీ రాబరీ’ అని స్పష్టమవుతోంది.
*హైదరాబాద్, వాణీ విజయం
భాగ్యనగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన పేరుతో సాగుతున్న భూసేకరణ ప్రక్రియ పెద్ద ఎత్తున అవినీతికి అడ్డాగా మారింది. భూములు కోల్పోయిన బాధితులకు పరిహారంగా ఇచ్చే ‘బదిలీ చేయగల అభివృద్ధి హక్కులు’ (టీడీఆర్) బాండ్ల జారీలో నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. లంచాలకు కక్కుర్తి పడ్డ నగర ప్రణాళిక విభాగం, భూసేకరణ విభాగపు అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి నిందితులకు సహకరించడంతో కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టింది.

*ఫోర్జరీ పత్రాలతో కోట్లలో టీడీఆర్ దందా!
రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో జరిగిన ఓ ఘోరమైన అక్రమం జీహెచ్ఎంసీలో కలకలం రేపింది. డెయిరీ ఫామ్ నుంచి కిస్మత్పూర్ వరకు రోడ్డు విస్తరణ కోసం సేకరించిన భూములను ఆసరాగా చేసుకుని కొందరు నిందితులు నకిలీ యాజమాన్య పత్రాలను, తప్పుడు విద్యుత్ బిల్లులను సృష్టించారు.
ఈ మోసానికి నగరపాలక సంస్థలోని కొందరు ఉన్నతాధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే, ఉప నగర ప్రణాళికాధికారి, విభాగపు అధికారి, కొలతల అధికారులు (సర్వేయర్లు) ఆ నకిలీ పత్రాల ఆధారంగా రూ. 5.78 కోట్ల విలువైన టీడీఆర్ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. ఆ తర్వాత నిందితులు ఆ బాండ్లను ఒక భవన నిర్మాణదారునికి (బిల్డర్) అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అసలు భూ యజమానులు తమ భూమిపై వేరే వాళ్లకు హక్కులు జారీ అయినట్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో, నలుగురు అధికారులతో పాటు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
‘బిల్డ్ నౌ’ వెబ్ సైట్ పారదర్శకతపై అనుమానాలు!
గతంలో భవన నిర్మాణ అనుమతుల కోసం ఉపయోగించిన డి.పి.ఎం.ఎస్, తెలంగాణ రాష్ట్ర భవన అనుమతులు మరియు స్వీయ ధృవీకరణ విధానం (టి.ఎస్.బి.పాస్) వెబ్ సైట్ ల స్థానంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) సాంకేతికతను జోడించి తీసుకొచ్చిన నూతన భవన అనుమతుల వెబ్ సైట్ ‘బిల్డ్ నౌ’ (Build Now) పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నూతన వెబ్ సైట్ లో పారదర్శకత లోపించడం, సమాచారాన్ని చీకట్లోనే ఉంచడం వల్ల ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా దొరకకుండా పోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతను ముసుగుగా వాడుకుని, టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు సైతం ఈ అక్రమాల్లో చేతులు కలిపినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*మార్కెట్ గుత్తాధిపత్యం.. ఇన్సైడర్ ట్రేడింగ్ గుట్టురట్టు!
ఈ కుంభకోణం వెనుక రాజకీయ ప్రయోజనాలు, వ్యవస్థీకృత అక్రమాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు 90 శాతం టీడీఆర్ బాండ్లను కొందరు దళారులు, రియల్టర్లు ముందుగానే ప్లాన్ ప్రకారం కారుచౌకగా (కేవలం 22-27 శాతానికే) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, నగరంలో భవన నిర్మాణ వైశాల్య సూచిక (ఎఫ్ఎస్ఐ) పై పరిమితులు విధించేలా సరికొత్త విధానపరమైన మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో అదనపు అంతస్తుల నిర్మాణానికి టీడీఆర్ బాండ్లు కొనడం అనివార్యం చేయడం ద్వారా, మార్కెట్లో వాటి ధరను ఏకంగా 60 శాతానికి పెంచి, తద్వారా రూ. 600 కోట్ల నుంచి వేల కోట్ల రూపాయల అక్రమ లాభాలను ఆర్జించేందుకు ఒక పెద్ద “ఇన్సైడర్ ట్రేడింగ్” కుట్ర జరుగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*వ్యవస్థలోని లోపాలివే.. లూప్‌హోల్స్ దుర్వినియోగం!
పట్టణ ప్రణాళిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, నగరపాలక సంస్థలోని కింది లోపాల వల్లే ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి:
*హక్కుల నిర్ధారణ లోపం: భూమిపై అసలైన హక్కులు ఎవరికి ఉన్నాయో రెవెన్యూ రికార్డులతో సరిచూడటంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు.
*లింక్ పత్రాల పరిశీలన కరువు: ఒకే సర్వే నంబర్‌పై బహుళ రిజిస్ట్రేషన్లు ఉన్నా, నకిలీ సర్వహక్కుల పత్రాలు (జీపీఏ) సృష్టించినా వాటి లోతుల్లోకి వెళ్లకుండానే బాండ్లు జారీ చేస్తున్నారు.
*ఆన్లైన్ రికార్డుల మాయాజాలం: ఎటువంటి మద్దతు పత్రాలు లేకుండానే ఆన్లైన్ రికార్డుల్లో పేర్లు మార్చేసి, ఆపై టీడీఆర్ క్లెయిమ్ చేస్తున్నారు.
*నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి?
జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ, వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్న ఈ టీడీఆర్ అవినీతి తంతు ద్వారా కొందరు అవినీతి అధికారులు లక్షలు, కోట్లు మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నకిలీ బాండ్ల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్ విభాగాలు నిఘా ఉంచాయి. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ ఎక్కడ..? నగరంలో ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి నకిలీ బాండ్లు జారీ అయ్యాయనే కోణంలో లోతైన శోధన సాగుతోంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన అధికారుల అసలు రంగు బయటపడాల్సి ఉంది.
రేపటి కథనంలో మరిన్ని ఆధారాలతో..




