- ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాలు అరికట్టాలి..
- అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు:
- అక్రమార్కుల భరతం పట్టాలని బాధితుల వినతులు!
- అక్రమ లే ఔట్ల మధ్య దేవుడి విగ్రహాల పేరుతో దారులు బంద్.
హైదరాబాద్:
కోకాపేట లెజెండ్ చైమ్స్ ఫేజ్-2 కాలనీలో విచిత్రమైన సమస్య వెలుగులోకి వచ్చింది. ఒకే లే ఔట్లో ఫేజ్-1, ఫేజ్-2 పేరిట వేర్వేరు ప్రాంతాలను విభజిస్తూ రోడ్లకు అడ్డుగా గోడలు కడుతున్నారు. ప్రశ్నించిన స్థానికులపై దేవుడి విగ్రహాలు ఏర్పాటు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. పొరుగు కాలనీలకు కూడా కనీస రాకపోకలు లేకుండా దారులు మూసివేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
*అనుమతులు లేని అక్రమ నిర్మాణాలతో ముప్పు:
కేపీహెచ్‌బీ కాలనీ ఏడవ ఫేజ్‌లో నిబంధనలకు పాతరేశారు. కేవలం 80 గజాల అతి తక్కువ స్థలంలో ఏకంగా ఏడు అంతస్తుల భారీ భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదకర అక్రమ కట్టడాల వల్ల చుట్టుపక్కల నివాసాల ప్రజల ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉందని, అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాలను నిలిపివేయాలని ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదులు అందజేశారు.
*ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా పరం
మెహిదీపట్నం సంతోష్‌నగర్ కాలనీలోని విలువైన ప్రభుత్వ భూమిని ఆపార్టుమెంటు నిర్వాహకులు ఆక్రమిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పశుమాముల గ్రామంలో పార్కుల కోసం కేటాయించిన స్థలాన్ని సైతం ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని మహదేవ్పూర్ కాలనీలో సుమారు 80 వేల గజాల ప్రజావసరాల స్థలాలు, పార్కులు కబ్జాకోరల్లో చిక్కుకుని సగానికి పైగా మాయమయ్యాయి.
*చారిత్రక సంపద, జల వనరులపై కబ్జాదారుల కన్ను
సికింద్రాబాద్ బొల్లారం ద్వారకాపురి కాలనీలో పురాతన బావి కాలక్రమేణా చెత్త డంపింగ్ ప్రదేశంగా మారింది. ప్రమాదకర వైద్య వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రాజేంద్రనగర్ మండలం చింతల్మెట్ శ్రీ హస్తాల వీరభద్ర స్వామి దేవాలయ భూములు, పురాతన నీటి గుండాలను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్న వైనంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. అలాగే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని ఆంకుషాపూర్ సాయికృష్ణానగర్‌లో పార్కులు, రహదారులను కబ్జా చేసి ప్లాట్లుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.
*పరికి చెరువు పునరుద్ధరణకు పౌరుల అర్జీలు
గాజులరామారంలోని చారిత్రక పరికి చెరువులోకి పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు చేరి తీవ్రంగా కలుషితమవుతోంది. ఈ కాలుష్యం కారణంగా స్థానికులు చర్మవ్యాధులు, శ్వాసకోస సమస్యలతో అల్లాడిపోతున్నారు. హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ జాబితాలో పరికి చెరువును కూడా చేర్చి, స్వచ్ఛమైన జలాలను అందించాలని మహదేవ్పూర్ డెవలప్మెంట్ ఫోరం తరఫున ప్రజలు విజ్ఞప్తి చేశారు. మొత్తం 47 ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.



