Monday, September 21, 2026
Google search engine
Homeతెలంగాణఅక్రమ నిర్మాణాలకు అండగా "నార్సింగ్" మున్సిపల్ అధికారుల అభయహస్తం.

అక్రమ నిర్మాణాలకు అండగా “నార్సింగ్” మున్సిపల్ అధికారుల అభయహస్తం.

  • కోకాపేటలో మున్సిపల్ అధికారుల బరితెగింపు:
  • ‘మై క్యూర్‌’ యాప్‌ను అపహాస్యం చేస్తున్న డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి జి… ఆర్టీఐ చట్టాన్ని ఖూనీ చేస్తున్న ఏసీపీ ప్రసీద లీలలు!
  • రెసిడెన్షియల్ అనుమతులతో భారీ కమర్షియల్ నిర్మాణం
  • ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి లేకుండా ప్రమాదకరంగా అక్రమంగా నిర్మించిన మెక్ డొనల్స్ భవనం..
  • సి.ఎం.సి విజిలెన్స్ అధికారుల, నిఘా విభాగాల అధికారుల చర్యలు ఎక్కడ..?
  • శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్, నారాయణ అమిత్, సిఎంసి కమిషనర్ శ్రీజన దృష్టి సారించాలి

హైదరాబాద్:

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేరిలింగంపల్లి జోన్ నార్సింగ్ సర్కిల్ రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం, కోకాపేట పరిధిలో మున్సిపల్ చట్టాలు, నిబంధనలు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయి. ప్రజాధనంతో నడుస్తున్న వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, నార్సింగి మున్సిపల్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న వైనం అత్యంత విస్మయకరంగా మారింది. నివాస గృహాల కోసం ఇచ్చిన అనుమతులను తుంగలో తొక్కి, అదే భవనాలలో నిస్సిగ్గుగా వాణిజ్య సామ్రాజ్యాలు విస్తరిస్తున్నా అధికారుల కళ్ళు తెరచుకోవడం లేదు. కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు శూన్యమని, ఖాళీ స్థలాలు మృగ్యమని తెలిసినా నార్సింగి మున్సిపల్ పెద్దలు అక్రమదారులకు సాష్టాంగ నమస్కారాలు చేస్తుండటం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.

*’మై క్యూర్‌’ యాప్‌పై అపహస్యం.. పది నెలల జాప్యం వెనుక ఆంతర్యమేమిటి?
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మొబైల్ అప్లికేషన్ ‘మై క్యూర్‌’ను నార్సింగి డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి జి తన నిర్లక్ష్యపు ధోరణితో పూర్తిగా అపహాస్యం చేస్తున్నారు. సర్వే నంబర్ 165 లోని ప్లాట్ నంబరు 6, 6/ఎ భవనంలో జరుగుతున్న ఈ అక్రమ దందాపై బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ఏకంగా పది నెలలు గడుస్తున్నా, నేటికీ ఆ దిశగా కనీస చర్యలు శూన్యం. క్షేత్రస్థాయికి వెళ్లి సదరు అక్రమ భవనాన్ని సీజ్ చేయాల్సిన డిప్యూటీ కమిషనర్, కేవలం తూతూమంత్రంగా దందాలు జరుగుతున్నట్లు రికార్డుల్లో చూపి బాధితుల దరఖాస్తులను బుట్టదాఖలు చేశారు. బాధితులు కార్యాలయానికి వెళితే నిరుత్సాహపరచడం, సమాధానం చెప్పకుండా దాటవేయడం వెనుక అందుతున్న ముడుపుల మత్తే ప్రధాన కారణమనే తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

*ఆర్టీఐ చట్టాన్ని తుంగలో తొక్కిన ఏసీపీ ప్రసీద.. చట్టాల ఉల్లంఘన!
అక్రమ భవనంపై వెలువడిన చర్యల వివరాలను కోరుతూ బాధితులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే, నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ ప్రసీద చట్టాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, పారదర్శకతను పాటించాల్సింది పోయి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, పొంతన లేని సమాధానాలతో బాధితులను మానసిక వేధింపులకు గురిచేయడం క్షమించరాని నేరం. అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగమే నేరస్థులకు రక్షణ కవచంగా మారుతుందంటే, అక్కడ ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో ఇట్టే స్పష్టమవుతోంది.

‘స్థానిక ప్రజల’ తీవ్ర డిమాండ్..

  • కోకాపేట సర్వే నంబర్ 165 లోని ప్లాట్ నంబరు 6, 6/ఎ భవనంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న వాణిజ్య సముదాయాన్ని తక్షణమే సీజ్ చేయాలి.
  • ప్రభుత్వ మొబైల్ అప్లికేషన్‌ను హేళన చేస్తూ, పది నెలలుగా బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిన డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి జి పై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.
  • సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించి, అక్రమార్కులను కాపాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ ప్రసీద వైఖరిపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలి.
  • నార్సింగి మున్సిపాలిటీలో వేళ్ళూనుకున్న అవినీతి భాగోతంపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన ఐఏఎస్ మరియు విజిలెన్స్ విభాగం స్వతంత్ర సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments