ఎల్బీనగర్
తెలంగాణ సారస్వత పరిషత్ డాక్టర్ దేవులపల్లి రామానుజ కళామందిర్ లో 1996 లో స్థాపించిన ఆదర్శ కళా నిలయం అధ్వర్యంలో భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు మరియు టాలెంట్ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు, సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ కు “డా. బి ఆర్ అంబేద్కర్ జాతీయ”పురస్కారాన్ని అందచేశారు.ఈ సంధర్భంగా దైవజ్ఞశర్మ మాట్లాడుతూ, అనాధ విద్యార్థి గృహాన్ని ప్రత్యక్షంగా సందర్శించానని, అధ్యక్షులు మార్గం రాజేష్ నిరంతర మార్గదర్శకత్వంలో అక్కడ విద్యార్థులు హాస్టల్లోని అన్ని పనులు తామే చేసుకుంటూ, ఆర్థికమైన కార్యక్రమాలు స్వయంగా నిర్వహిస్తూ ఈ ప్రపంచానికే ఆదర్శంగా గృహాన్ని నడుపుతున్నారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల అనాథ విద్యార్థులకు ఉచిత భోజన,వసతి, అన్ని సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తుకు, వారు ఉన్నత శిఖరాలు చేరుటకు కృషి చేస్తున్న మార్గం రాజేష్ ను బిఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినందుకు ఆదర్శ కళానిలయం కమిటీని అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ, టీవీ నటులు రాజేంద్ర, ఆదర్శ కళా నిలయం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చేరాల ప్రకాష్,డైరెక్టర్ లలిత,డాక్టర్ మురుగన్ హాజరైనారు.


