- అక్రమ వ్యర్థాల వాహనాలు సీజ్ చేయాలని సూచన
- ఏఐపీసీ చైర్మన్ మధుయాష్కి గౌడ్
ఎల్బీనగర్
ఆటోనగర్ డంపింగ్ యార్డ్ వద్ద పేరుకుపోయిన చెత్తను రాంకీ సంస్థ వెంటనే తొలగించాలని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హెచ్చరించారు. మన్సూరాబాద్ డివిజన్లోని ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ను 18 కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. చెత్త గుట్టలు, దుర్వాసన, నిర్మాణ వ్యర్థాలు, జంతు కళేబరాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అక్రమంగా వ్యర్థాలను తరలించే వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. చెత్తను బహిరంగంగా నిల్వ చేయకుండా క్లోజ్డ్ షెడ్లలో ఉంచి, రోజువారీగా తరలించాలని రాంకీ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. హయత్‌నగర్, నాగోల్ సర్కిళ్ల నుంచి మాత్రమే నిర్ణీత ప్రకారం చెత్తను తీసుకురావాలని, జంతు కళేబరాల నిర్వహణకు ఫతుల్లాగూడ తరహాలో క్రిమిటోరియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంత వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఎస్టీపీని నెలరోజుల్లోగా పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని ఐలా కమిషనర్ నాగరాజుకు తెలిపారు. డంపింగ్ యార్డ్ వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అటవీ ప్రాంతంలో వ్యర్థాలు పడేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ జంతు సంరక్షణ అధికారి డాక్టర్ రంజిత్, ఐలా కమిషనర్ నాగరాజు, ఎఫ్ఆర్వో సాయి ప్రకాష్, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి వెంకట నర్సు, డీఈ సందీప్, రాంకీ సంస్థ ప్రతినిధి, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వి చౌదరి, కాంగ్రెస్ మన్సూరాబాద్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి బాలకృష్ణ యాదవ్, డీసీసీ కార్యదర్శి కొప్పుల వెంకటరెడ్డి, భీమిడి రామకృష్ణ రెడ్డి, వేములయ్య గౌడ్, కన్నా మహేష్, పోచబోయిన సురేష్ యాదవ్, ప్రమీల, మమత, కాలనీల జేఏసీ చైర్మన్ కత్తుల రాంబాబు, కార్యదర్శి కిషోర్ బాబు, ప్రతినిధులు రమేష్, అంజయ్య గౌడ్, దామోదర్ గౌడ్, కిరణ్, కృష్ణయ్య, చంద్రారెడ్డి, ధర్మేందర్ రెడ్డి, రాములు, రవికుమార్, రామ్మోహనచార్యులు, జయరాం రెడ్డి, వర్మ తదితరులు పాల్గొన్నారు.


