కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, వేలాది మంది ఉద్యోగులతో కూడిన ఒక ఉమ్మడి కుటుంబమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నర్సంపేట డిపోకు చెందిన దివంగత డ్రైవర్ కోలా శంకర్ కుటుంబానికి సంస్థ ఉద్యోగులు ‘చేయూత’ కార్యక్రమం ద్వారా స్వచ్ఛందంగా సేకరించిన రూ. 90,85,500 (తొంభై లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయల) భారీ ఆర్థిక సహాయ చెక్కును సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై. నాగిరెడ్డి చేతుల మీదుగా దివంగత డ్రైవర్ భార్య హేమలత, కుమారుడు హేమంత్, కుమార్తె షాలినిలకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేసి, సంస్థ తరఫున పూర్తి భరోసా కల్పించారు.
*ఆ కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తోటి కార్మికుడి కుటుంబం కోసం ఆర్టీసీ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి అండగా నిలవడం వారి మానవత్వానికి నిదర్శనమన్నారు. శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అర్ధరాత్రి వేళ తాను స్వయంగా వెళ్లి పరామర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని స్పష్టం చేస్తూ, అందులో భాగంగానే శంకర్ కుమారుడు హేమంత్‌కు ఆర్టీసీలో ఉద్యోగ నియామక పత్రాన్ని, అలాగే ఆ కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
*ఆర్టీసీ సమస్యల పరిష్కారమే ధ్యేయం
గత పాలకులు ఆర్టీసీ కార్మిక సంఘాలను రద్దు చేసి నిరంకుశంగా వ్యవహరించారని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీలోని ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
*మహాలక్ష్మి పథకం:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం నెలకు రూ. 300 కోట్లను సంస్థకు విడుదల చేస్తోందని వివరించారు. పనిభారం పెరిగినప్పటికీ సిబ్బంది ఎంతో నిబద్ధతతో పనిచేసి ఈ పథకాన్ని విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి వంటి పండుగ దినాల్లోనూ విధులకు ప్రాధాన్యతనిచ్చిన మహిళా సిబ్బంది సేవలను అభినందించారు.
*ఇందిరమ్మ ఇళ్లకు అర్హత:
రూ. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఆర్టీసీ ఖాయం (రెగ్యులర్) ఉద్యోగులతో పాటు, పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) సిబ్బంది కూడా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. రిటైర్డ్ కార్మికుల సమస్యలపై కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
*రవాణా వ్యవస్థ బలోపేతానికి ముందడుగు
రాబోయే రోజుల్లో సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం అనే మూడు సూత్రాల ఆధారంగా ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికల అనంతరం, నలుగురు మంత్రులు మరియు అధికారుల కమిటీ నిర్ణయం మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
దీనితో పాటు కోర్ ఏరియా (ప్రధాన నగర ప్రాంతం) పరిధిలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మిస్తామని, గ్రామాల నుండి రాజధాని వరకు కొత్త మార్గాల్లో బస్సులు నడుపుతూ, మెట్రో మరియు ఎంఎంటిఎస్ సర్వీసులతో ఆర్టీసీని అనుసంధానం చేసి రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ అనేది పేదవాడి గుండె చప్పుడు అని, యాజమాన్యం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి చర్యల్లో ఉద్యోగులంతా మరింత బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
*ఉద్యోగుల అంతర్గత బంధానికి నిదర్శనం: ఎండీ వై. నాగిరెడ్డి
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. తోటి ఉద్యోగి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు సిబ్బంది అంతా కలిసి రూ. 90.85 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని అందించడం ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఉన్న బంధానికి, పరస్పర సహకారానికి ఒక గొప్ప నిదర్శనమన్నారు. సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమం, భద్రత, శిక్షణ, పని పరిస్థితుల మెరుగుదల కోసం యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే తమ తొలి ప్రాధాన్యమని, ప్రతి డ్రైవర్, కండక్టర్ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ టికెటింగ్, బస్సుల ఆధునీకరణ వంటి సాంకేతిక మార్పులను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల క్రమశిక్షణ, టీమ్‌వర్క్‌తో టీజీఎస్ ఆర్టీసీ దేశంలోనే ఆదర్శవంతమైన ప్రజా రవాణా సంస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
*జీవితాంతం రుణపడి ఉంటాం: హేమలత
దివంగత డ్రైవర్ శంకర్ భార్య హేమలత మాట్లాడుతూ, తమ కుటుంబానికి అండగా నిలిచి ఇంతటి భారీ సహాయాన్ని అందించిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని నిలబెట్టిన తోటి కార్మికులకు జీవితాంతం రుణపడి ఉంటామని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే తన భర్త శంకర్‌గౌడ్ ఆశయాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు చల్లా వెంకన్న, రాజశేఖర్, సోలోమన్, ఏచూరి శ్రీధర్, ఆర్థిక సలహాదారు విజయపుష్ప, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ ప్రభులత, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ జనీరెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఉన్నతాధికారులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


