ఎల్బీనగర్:
ఇంజనీరింగ్ చదువుతున్న 20 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశాఖపట్నం బస్ ఎక్కినప్పటి నుండి యువతి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురైన అనంతరం పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చర్లపల్లి, బీఎన్ రెడ్డి నగర్ కాలనీ, ఈసీ నగర్‌కు చెందిన ఉలరౌతు భార్గవి (20) వైజాగ్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడి హాస్టల్‌లో ఉంటోంది. అనారోగ్య కారణాలతో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చిన భార్గవి, తిరిగి హాస్టల్‌కు వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది.
ఈ క్రమంలో నవంబర్ 1వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో వనస్థలిపురంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ సమీపంలో విశాఖపట్నం వెళ్లేందుకు మినీ బస్సు ఎక్కింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు.దీంతో భార్గవి తల్లి శోభారాణి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.అదృశ్యమైన యువతి వివరాలు : భార్గవి వయస్సు 20 సంవత్సరాలు, ఎత్తు సుమారు 4 అడుగుల 8 అంగుళాలు, తెల్లని ఛాయ కలిగి ఉంటుంది. యువతి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.


