- నెల 15 రోజులుగా నల్లాల్లో మురుగునీటి సరఫరా..
- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జలమండలి అధికారుల నిర్లక్ష్యం!
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గంలోని డాక్టర్స్ కాలనీ డివిజన్ జేబీ కాలనీ రోడ్ నెంబర్ 7/ఏ గత నెల 15 రోజులుగా నల్లా నీటితో పాటు మురుగునీరు సరఫరా అవుతున్నా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి కూడా పనికిరాని విధంగా దుర్వాసనతో కూడిన కలుషిత నీరు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
“ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు మురుగునీరు తాగి చావాలా? మా ప్రాణాలకు విలువ లేదా?” అంటూ జేబీ కాలనీ వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు.ఈ సమస్యపై బీజేపీ నాయకులు జలమండలి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఫిర్యాదులు స్వీకరించి చేతులు దులుపుకోవడం కాకుండా, అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేశారు.నల్లా పైపులైన్లను తనిఖీ చేసి మురుగునీరు కలుస్తున్న కారణాన్ని గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, కలుషిత నీటి సరఫరాను తక్షణమే నిలిపివేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కోరారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకునేది లేదు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు తీసుకోవాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలి. లేనిపక్షంలో ప్రజల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ నాయకులు సిద్దు, జంగయ్య స్థానిక నేతలు హెచ్చరించారు.
జలమండలి డిజిఎం వివరణ.
ప్రజావాణిలో మురికి నీళ్లు వస్తున్నాయని జేబీ కాలనీవాసుల పిర్యాదు మేరకు, జలమండలి డీజీఎం చంద్రు నాయక్ వివరణ ఇచ్చారు. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి జేబీ కాలనీవాసులకు మంచినీరు అందిస్తామని తెలిపారు.



