- వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
- రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
- ఏడు ఇండ్ల దొంగతనం కేసుల్లో నిందితుడి పాత్ర గుర్తింపు
ఎల్బీనగర్
తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 5న సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్జీఓస్ కాలనీ సమీపంలోని ఓ నగల దుకాణం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని యర్రం శెట్టి చరణ్ విఘ్నేష్‌గా గుర్తించారు.
దొంగతనాలకు పాల్పడుతున్న తీరు ఇదీ..
నిందితుడు ద్విచక్ర వాహనంపై కాలనీల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించేవాడు. అనంతరం ఇనుప రాడ్డుతో ఇంటి ప్రధాన తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడేవాడు. బీరువాలను తెరిచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగిలించేవాడు. దొంగిలించిన ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రూ.3 లక్షల ఆస్తి స్వాధీనం
నిందితుడి నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 26 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 11 గ్రాముల బంగారు ఉంగరం, 15 గ్రాముల బరువున్న రెండు జతల బంగారు చెవి పోగులు, మట్టెలు ఉన్నాయి. అలాగే నిందితుడికి చెందిన వన్‌ప్లస్ సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఏడు కేసుల్లో నిందితుడి పాత్ర
నిందితుడు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సరూర్‌నగర్ పరిధిలో ఒకటి, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు..మొత్తం ఏడు ఇండ్ల దొంగతనం కేసుల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మార్గదర్శకత్వంలో, ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి. అనురాధ పర్యవేక్షణలో వనస్థలిపురం ఏసీపీ టి. కరుణాకర్ రావు, సీఐ రవి బాబు, డీఐ బి. రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.


