బస్తీ దర్బార్‌లో వెల్లువెత్తిన ప్రజా సమస్యలు
ఎల్బీనగర్:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నెలకొన్న తీవ్రమైన ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చామకూర రాజు డిమాండ్ చేశారు. సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఎన్టీఆర్ నగర్‌లో ప్రత్యేకంగా ‘బస్తీ దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గోళ్లను వెళ్లబోసుకుంటూ బస్తీలో ఉన్న పలు సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకువచ్చారు.
*ప్రధాన సమస్యలు:
- ఇండ్ల పట్టాలు లేకపోవడం వల్ల నివాసితులు పడుతున్న ఇబ్బందులు.
- అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థ.
- వీధిలైట్ల నిర్వహణ లోపించడం వల్ల రాత్రివేళల్లో అంధకారం.
- పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా క్షీణించడం.
- వర్షాకాలంలో రోడ్లు జలమయమై నడవడానికి కూడా వీలు లేకుండా మారుతున్న దుస్థితి.
ఈ సందర్భంగా చామకూర రాజు మాట్లాడుతూ, ఎన్టీఆర్ నగర్ బస్తీ ప్రజల ఓట్లతో గెలుపొంది మంత్రులుగా, కార్పొరేటర్లుగా చలామణి అవుతున్న వారు కనీస సౌకర్యాలను కూడా కల్పించకపోవడం శోచనీయమన్నారు. మున్సిపల్ అధికారులు, జలమండలి అధికారులు తక్షణమే స్పందించి బస్తీలోని సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించారు.
పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కే.వీ. గౌడ్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా బస్తీల అభివృద్ధిని విస్మరిస్తూ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాన కార్యదర్శి బాలాపూర్ బాలస్వామి మాట్లాడుతూ, కొద్దిపాటి వర్షం కురిసినా బస్తీ అంతా బురదమయమై ప్రజలు రాకపోకలు సాగించలేని దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారుల మీద ఒత్తిడి తెస్తామని, అవసరమైతే ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం. సతీష్, మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులు సైదులు యాదవ్, అధికార ప్రతినిధి చిత్తలూరు వేణు గౌడ్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు వడ్డెర రఘుపతి తదితరులు పాల్గొన్నారు.


