- ముడుపుల మత్తులో టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం!
- రూ. 50 లక్షల ప్రజాధనానికి గండి.. మూడు నివాస అనుమతుల ముసుగులో భారీ వాణిజ్య సముదాయం!
- కూల్చివేతలు జరిపినట్లు నకిలీ నివేదికలతో ఉన్నతాధికారుల కళ్లకు గంతలు!
- న్యాయస్థానాలను ఆశ్రయించాలని అక్రమార్కులకు సాయి అర్చన ఉచిత సలహాలు!
- అవినీతి కంపులో ఎల్బీనగర్ సర్కిల్ 13 ఉప కమిషనర్ పాత్రపై అనుమానాలు!
- బిల్డ్ నౌ వెబ్సైట్లో పారదర్శకత లోపం: టౌన్ ప్లానింగ్ అధికారులు ఆడింది ఆట పాడింది పాట చేసింది శాసనం..
- జోనల్ కమిషనర్ హేమంత్ మహతో, కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించాలని స్థానికుల డిమాండ్!
ప్రజాధనానికి రూ. 50 లక్షల గండి కొడుతూ, నిబంధనలను నిలువునా పాతరేస్తున్న ఎల్బీనగర్ సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ యంత్రాంగం అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది. ముడుపుల మత్తులో కర్మన్‌ఘాట్‌లో నివాస అనుమతుల ముసుగులో భారీ వాణిజ్య సముదాయం వెలుస్తున్నా, ‘బిల్డ్ నౌ’ పారదర్శకతను అపహాస్యం చేస్తూ అధికారులు ఆడిందే ఆటగా మార్చేశారు. కూల్చివేతల పేరిట నకిలీ నివేదికలతో ఉన్నతాధికారుల కళ్లకు గంతలు కడుతూ, అక్రమార్కులకు కోర్టు స్టే సలహాలిస్తున్న ఈ అవినీతి తిమింగలాల భాగోతంపై జోనల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ఉక్కుపాదం మోపాలని స్థానికులు నినదిస్తున్నారు.
ఎల్బీనగర్
బిల్డ్ నౌ వెబ్సైట్లో పారదర్శకత లోపం: టౌన్ ప్లానింగ్ అధికారులు ఆడింది ఆట పాడింది పాట చేసింది శాసనం అన్న చందంగా సాగుతుంది తతంగం, భవిష్యత్తులో ప్రభుత్వ భూమిలో, అనుమతులు మంజూరు చేసినా అడిగే వారు లేరు అన్న చందంగా వెబ్సైట్ పనిచేయడం.. ఆశ్చర్యాన్ని గురి చేస్తున్న విషయం.. పబ్లిక్ పోర్టల్ పబ్లిక్ కోసం పనిచేయాలి గాని అధికారుల అవినీతిని కప్పిపుచడానికి పనిచేస్తుంది అనడానికి ఈ వార్తా కథనం నిదర్శనం..
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్, సర్కిల్-13 పరిధిలోని కర్మన్‌ఘాట్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా చెలరేగిపోతోంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం, టీకేఆర్ కళాశాల బస్ స్టాప్ నుండి హనుమాన్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న రోడ్ నెం. 9, సర్వే నెం. 60, ప్లాట్ నెం. 32 (తూర్పు మరియు మధ్య భాగాలు)లో నిబంధనలకు విరుద్ధంగా భారీ వాణిజ్య భవనం వెలుస్తోంది. ఈ అక్రమ దందాకు సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ అధికారి సాయి అర్చన, ఉప కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ పూర్తి అండదండలు అందిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నివాస అనుమతుల ముసుగులో వాణిజ్య దోపిడీ:
అనుమతి 1: ఫైల్ నంబర్: 020147/GHMC/05299/IABP/C4/2025 | పర్మిట్ నంబర్: 5132/GHMC/IA/C4/2025
అనుమతి 2: ఫైల్ నంబర్: 014976/GHMC/04232/IABP/C4/2025 | పర్మిట్ నంబర్: 3067/GHMC/IA/C4/2025
స్థలం (చిరునామా): ప్లాట్ నంబర్ 32 (తూర్పు మరియు మధ్య భాగాలు), సర్వే నంబర్ 60, హనుమాన్ నగర్ రోడ్ నంబర్ 9, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా.
600 గజాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని కాగితాలపై మూడు వేర్వేరు భాగాలుగా విభజించి, విడివిడిగా ‘గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల’ నివాస భవనాలకు అనుమతులు పొందారు. కానీ క్షేత్రస్థాయిలో వాటన్నింటినీ కలిపి ఒకే భారీ వాణిజ్య సముదాయంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ చట్టాల ప్రకారం, వాణిజ్య భవనాలకు చెల్లించాల్సిన మార్పిడి రుసుములు, తనఖా నిబంధనలు, ఆక్యుపెన్సీ ధృవీకరణ పత్రం మరియు అగ్నిమాపక భద్రతా అనుమతులను ఎగవేసేందుకే ఈ మోసపూరిత ఎత్తుగడ వేశారు. ఈ అక్రమ తంతు ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 50 లక్షల వరకు పన్నుల రూపంలో గండి పడింది. స్థల పరిశీలన సమయంలోనే ఈ వ్యవహారాన్ని గుర్తించిన సాయి అర్చన, భారీగా ముడుపులు పుచ్చుకొని అక్రమ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.
ప్రమాదకర సెల్లార్ తవ్వకాలు.. చుట్టుపక్కల ఇళ్లకు ముప్పు:
కనీస ఖాళీ స్థలాలు విడిచిపెట్టకుండా, ఇంజనీరింగ్ నిబంధనలను తుంగలో తొక్కి భూమి లోపలికి ప్రమాదకర రీతిలో సెల్లార్ తవ్వకాలు జరిపారు. శాస్త్రీయ ఆధారాలు, భూగర్భ పరీక్షలు లేకుండా జరిపిన ఈ లోతైన తవ్వకాల వల్ల పక్కనున్న నివాస భవనాల పునాదులు కదిలి కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు ఏమాత్రం లేకపోవడంతో, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే పెను ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ నివేదికలతో ఉన్నతాధికారులకే టోపీ:
నాలుగు నెలల క్రితమే ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు స్పందించలేదు. పైగా, ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగడంతో, క్షేత్రస్థాయిలో ఎలాంటి సీజింగ్ లేదా కూల్చివేతలు జరపకుండానే, చర్యలు తీసుకున్నట్లు నకిలీ చిత్రాలు, తప్పుడు ఉత్తర్వులను దస్త్రాలలో జతచేసి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. అంతేకాకుండా, నిర్మాణదారుడితో చేతులు కలిపిన సాయి అర్చన, అధికారుల చర్యల నుండి తప్పించుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీజింగ్ మరియు కూల్చివేత ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్మాణదారుడు తిరిగి పనులు కొనసాగిస్తున్నా, ఇన్ఛార్జ్ అధికారిగా ఉన్న ఉప కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ మౌనం వహించడం వెనుక భారీ అవినీతి వాటాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులు తక్షణమే చేపట్టాల్సిన చర్యలు:
- ప్రభుత్వ ఖజానాకు రూ. 50 లక్షల నష్టం కలిగించి, నకిలీ నివేదికలతో ఉన్నతాధికారులను మోసగించిన టౌన్ ప్లానింగ్ అధికారి సాయి అర్చన, ఉప కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌లపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకొవాలి.
- తప్పుడు పత్రాలతో పొందిన మూడు నివాస అనుమతులను తక్షణమే రద్దు చేసి, ఆ అక్రమ వాణిజ్య సముదాయాన్ని పూర్తిస్థాయిలో సీజ్ చేయాలి.
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్ మరియు అదనపు అంతస్తులను తక్షణమే కూల్చివేయాలి.
- ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్‌పై, అందుకు సహకరించిన అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా సాగుతున్న ఈ అవినీతి బాగోతంపై ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ మహతో, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మరియు విజిలెన్స్ విభాగం అధికారులు తక్షణమే లోతైన విచారణ జరిపి, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.



