ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ శంఖారావం
రంగారెడ్డి బ్యూరో:
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ, ఓటర్ల జాబితా సవరణ (SIR) ముసుగులో కాంగ్రెస్ పార్టీ సానుకూల ఓట్లను అధికార పార్టీ కనుసన్నల్లో తొలగిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం (ECI) దుర్మార్గపు వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఈ ముసుగు కుట్రలను నిరసిస్తూ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) నైతిక బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పిలుపు మేరకు అత్యున్నత స్థాయి సన్నాహక జూమ్ సమావేశం నిర్వహించారు.
*కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం – రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కనున్న శ్రేణులు:
ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ కేసీ వేణుగోపాల్ గారి అధ్యక్షతన జరిగిన ఈ అత్యున్నత సమావేశంలో, ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీస్తున్న ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. రేపు (సెప్టెంబర్ 28) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన మహా ఆందోళన కార్యక్రమాలను సంపూర్ణంగా విజయవంతం చేయాలని నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీ వంశీచంద్ రెడ్డి గారు పాల్గొన్నారు.
*రంగారెడ్డి జిల్లాలో ఉవ్వెత్తున ఎగయనున్న నిరసన జ్వాలలు: అధ్యక్షురాలు పారిజాత నర్సింహారెడ్డి సంచలన పిలుపు
ఈ కీలక సన్నాహక సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కుట్రలను, ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని క్షేత్రస్థాయిలో ఎండగడతామని తేల్చిచెప్పారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలివచ్చి, జిల్లా కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయ చేయాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ బలమైన ఓట్లను అన్యాయంగా తొలగిస్తున్న ముసుగు కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఈ దుర్మార్గపు విధానాలపై ప్రజలను చైతన్యం చేసి ఎన్నికల సంఘం మెడలు వంచుతామని ఆమె హెచ్చరించారు. రేపటి ఆందోళనలో జిల్లా శ్రేణులు అప్రమత్తంగా ఉండి, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను రాష్ట్రంలోని ప్రతీ గడపకూ తీసుకెళ్లి, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది.



