Friday, October 30, 2026
Google search engine
Homeతెలంగాణకర్మన్‌ఘాట్‌లో రైస్ డీలర్లపై అధికారుల మెరుపు దాడులు!

కర్మన్‌ఘాట్‌లో రైస్ డీలర్లపై అధికారుల మెరుపు దాడులు!

  • 26 కిలోల ప్యాకెట్‌లో 24–25 కిలోలే బియ్యం..
  • జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై తనిఖీలు

ఎల్బీనగర్

హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో రిటైల్‌, హోల్‌సేల్‌ బియ్యం డీలర్ల దుకాణాలపై సివిల్‌ సప్లైస్‌, విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్‌ ఎస్పీ రామ్‌కుమార్‌, సిద్ధేశ్వర్‌ రావు,ఎల్బీనగర్‌ ఏసీపీ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందాల సహకారంతో సుమారు 10 నుంచి 12 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

ప్యాకెట్‌పై 26 కిలోలు.. తూకంలో తక్కువ!

బియ్యం సంచులపై 26 కిలోలుగా ముద్రించి ఉన్నప్పటికీ, తూకం వేయగా 24 నుంచి 25 కిలోల వరకే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని ప్యాకెట్లలో 25 కిలోల కంటే 20 నుంచి 30 గ్రాముల వరకు తక్కువ బరువు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో వినియోగదారులు చెల్లించిన ధరకు తగిన పరిమాణంలో బియ్యం అందుతున్నాయా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలన చేపట్టారు.

జీఎస్టీ ఎగవేతపై ఆరా..

ప్యాకేజ్డ్‌ బియ్యం సంచులపై బరువు వివరాలను ముద్రించడం, జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్యాకెట్లపై నెట్‌ క్వాంటిటీ వివరాలు, కంపెనీ పేరు తదితర తప్పనిసరి వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలనూ పరిశీలించారు.

బిల్లులు, వే-బిల్లులపైనా తనిఖీలు

బియ్యం సరఫరా చేస్తున్న లారీలకు సంబంధించిన బిల్లులు, జీఎస్టీ పత్రాలు, వే-బిల్లులను అధికారులు పరిశీలిస్తున్నారు. తూకంలో తేడాలు, ప్యాకేజింగ్‌ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన చోట సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం: విజిలెన్స్‌ ఎస్పీ రామ్‌కుమార్‌

కమిషనర్‌ ఆదేశాల మేరకు స్థానిక పోలీసుల సహకారంతో రిటైల్‌, హోల్‌సేల్‌ బియ్యం దుకాణాల్లో సంయుక్త తనిఖీలు చేపట్టినట్లు విజిలెన్స్‌ ఎస్పీ రామ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో ఈ ఏడాది సుమారు 30 నుంచి 35 వరకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో అక్రమాలకు తావులేకుండా చూడటం, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే పరిస్థితులను నివారించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

వినియోగదారులకు న్యాయం జరిగేలా..

బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులు ప్యాకెట్లపై పేర్కొన్న బరువు, వాస్తవ తూకాన్ని గమనించాలని అధికారులు సూచించారు. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై విచారణ అనంతరం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments