పేదింటి ఆడబిడ్డల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదు: సబితా ఇంద్రారెడ్డి
బడంగ్ పేట్
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మండల కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టి, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.పేదింటి ఆడబిడ్డ పెళ్లి అంటే తల్లిదండ్రులకు ఎంతటి ఆర్థిక భారమో అందరికీ తెలుసని, ఆ బాధను అర్థం చేసుకున్న కేసీఆర్ పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారని అన్నారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తూ వేలాది పేద కుటుంబాలకు ఈ పథకం అండగా నిలిచిందన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, ఇప్పటికే పేదలకు అందుతున్న పథకాలను కూడా నిర్వీర్యం చేయాలని చూడటం సరికాదన్నారు. కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన కోర్టు వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే స్పందించి,పేదల ప్రయోజనాలను కాపాడే విధంగా కౌంటర్ దాఖలు చేసి పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.“కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను రూపుమాపాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాల కోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోరాటం చేస్తాం. పథకాన్ని పూర్తిస్థాయిలో కొనసాగించే వరకు మా పోరాటం ఆగదు” అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.


