Monday, August 24, 2026
Google search engine
Homeతెలంగాణకాంక్రీట్ అడవిలో అక్రమ నిర్మాణాలపై నెత్తుటి సంతకాలు..

కాంక్రీట్ అడవిలో అక్రమ నిర్మాణాలపై నెత్తుటి సంతకాలు..

  • “బిల్డ్ నౌ వెబ్ సైట్ లో” పారదర్శకత లోపం తో.. , ఫేక్ ఓసీలు ఫేక్ టి.డి.ఆర్లు, అక్రమ నిర్మాణాల ప్రోత్సాహం అధికారుల ఇష్టారాజ్యం..
  • అనుమతులు ఒకరివి.. అంతస్తులు వేరొకరివి.. టౌన్ ప్లానింగ్ అవినీతికి నిండు ప్రాణాలు బలి!
  • గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణం కూలి పలువురి ప్రాణాలు బలి, ఈ పరిస్థితి బడంగ్పేట్ లో రిపీట్ కాకముందే కళ్ళు తెరవాలి..
  • బడంగ్పేట్ మొదలు గచ్చిబౌలి దాకా.. మామూళ్ల మత్తులో మున్సిపల్ యంత్రాంగం
  • బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య కి, వందల సంఖ్యలో అక్రమాలపై ఫిర్యాదులు చర్యలు తీసుకోవడంలో విఫలం..
  • శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ దృష్టి సారించాలి.

అనుమతులు రెండు… అంతస్తులొక ఏడు!
అవినీతి కాసులకు… కార్మికుల ప్రాణాలు బలి!
‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్‌లో… పారదర్శకత శూన్యం,
అక్రమార్కుల జేబుల్లో… అధికారుల రాజ్యం!
​మామూళ్ల మత్తులో… మున్సిపల్ యంత్రాంగం,
మృత్యు కూపంగా మారిన… మా భాగ్యనగరం!
నిబంధనలు గాలికొదిలి… నిండు ప్రాణాలు తీస్తూ,
కళ్లుండి చూడని కబ్జాదారుల దందా ఇది!

హైదరాబాద్

హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న వేళ.. నగర నడిబొడ్డున అక్రమ నిర్మాణాలు కార్మికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, అనుమతులకు మించి అంతస్తులు నిర్మిస్తున్న రాక్షస క్రీడలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో యాభై గజాల స్థలంలో ఐదంస్తుల భవనం పేకమేడలా కూలి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం నగరంలో నిర్మాణ భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతోంది. కేవలం కాసుల కక్కుర్తి కోసం సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులకు, వారికి అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ మరణాలు ఏమాత్రం పట్టడం లేదు.

*మృత్యుశాలలుగా మారుతున్న మహానగరం
గత ఐదేళ్ల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన వివిధ నిర్మాణ ప్రమాదాల్లో ఇరవై మందికి పైగా కార్మికులు బలయ్యారు.

  • 2021: పేట్‌బషీరాబాద్‌లో భవనం కుప్పకూలి ఇద్దరు మృతి.
  • 2023: కూకట్‌పల్లిలో అదనపు స్లాబ్ కూలి ఇద్దరు దుర్మరణం.
  • 2023: కేపీహెచ్‌బీ-అడ్డగుట్టలో పారాపెట్ గోడ కూలి ముగ్గురు మృతి.
  • 2024: బాచుపల్లిలో రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
  • 2025: మాన్సూరాబాద్‌లో సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు పడి కార్మికులు బలయ్యారు.
  • 2026: తాజాగా టోలిచౌకిలో స్కాఫోల్డింగ్ ప్రమాదం, గచ్చిబౌలిలో ఐదంస్తుల భవనం కుప్పకూలి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.

*మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్.. బడా బాబులకు అభయం!
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నలు లేకుండా చీమ కూడా కుట్టదనేది అక్షర సత్యం. రెండు మూడు అంతస్తులకు అనుమతి తీసుకొని, అడ్డగోలుగా ఐదారు అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ నోటీసులే అక్రమార్కులకు అస్త్రాలుగా మారుతున్నాయి. ముడుపులు దండుకుని, ఆ నోటీసులను బుట్టదాఖలు చేస్తూ యథేచ్ఛగా భవనాల నిర్మాణాలు, విక్రయాలు సాగిస్తున్నారు.
‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్‌లో పారదర్శకత లోపించడం ఈ అవినీతికి నిదర్శనం. ప్రభుత్వ నిషేధిత భూముల్లో అక్రమ అనుమతులు, నాలా మార్పిడి లేకుండా నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ (LRS) ధ్రువపత్రాలు, నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (OC), నకిలీ టీడీఆర్‌లతో కోట్లు కొల్లగొడుతున్నారు. సెల్లార్లు, రోడ్లు, ఫుట్‌పాత్‌లను కబ్జా చేస్తూ, ఎలాంటి అగ్నిమాపక భద్రతా నియమాలు పాటించకుండా భారీ వాణిజ్య సముచ్ఛయాలు నిర్మిస్తున్నా నిఘా విభాగాలు, విజిలెన్స్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

*బడంగ్పేట్ బాగోతం.. హైడ్రా, విజిలెన్స్ కంటితుడుపు చర్యలు!
దీనికి అత్యంత్యంత స్పష్టమైన ఉదాహరణ జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు, భారీ గిడ్డంగులు, వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారుల స్పందన శూన్యం. వందలాది ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వస్తున్నా కేవలం తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. హైడ్రా, విజిలెన్స్ అధికారులు పేద, మధ్యతరగతి ప్రజల చిన్న కట్టడాలపై ప్రతాపం చూపుతున్నారే తప్ప, కోట్ల రూపాయలు చేతులు మారుతున్న బడా బాబుల జోలికి వెళ్లడానికి గడగడలాడుతున్నారు. అధికారుల ఈ అవినీతి దాహానికి హైదరాబాద్ మహానగరం క్రమంగా కాంక్రీట్ అడవిగా, మృత్యు కూపంగా మారుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నిబంధనలు అమలు చేయని టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే అమాయక కార్మికుల ప్రాణాలు గాల్లో కలవడం ఇలాగే కొనసాగుతుంది!

భారత శక్తి ప్రశ్న: పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అవినీతి అధికారులపై, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు మీమాస ప్రదర్శిస్తోంది?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments