వికారాబాద్:
కొడంగల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సార్) ప్రక్రియపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బి ఎల్ ఏ లు), పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి అర్హుడి ఓటు నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
, “కొడంగల్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే నాకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. అందుకే రాష్ట్రస్థాయిలో నన్ను రాజకీయంగా దెబ్బతీయాలంటే ముందుగా కొడంగల్‌లో కాంగ్రెస్ బలాన్ని బలహీనపర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.పేర్లు వేరైనా బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. “ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని భావిస్తూ కుట్రలు చేస్తున్నారు. నేరుగా ఎదుర్కోలేక దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారు” అని విమర్శించారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా సమయం సరిపోవడం లేదని, అయినప్పటికీ కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని పేర్కొన్నారు. కొడంగల్‌లో కుట్రలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.సార్ ప్రక్రియపై వివరాలు వెల్లడిస్తూ, ఆగస్టు 3 వరకు గడువు ఉందని, కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,96,620 ఓట్లు ప్రక్షాళన పూర్తయ్యాయని, ఇంకా 54,635 మంది ఓటర్లు నమోదు కావాల్సి ఉందని తెలిపారు. మొత్తం ఓట్లలో 22 శాతం ఇంకా నమోదు కాలేదని, ఈ ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
“ఓటు పోగొట్టుకుంటే గుర్తింపు కోల్పోయినట్టే. అందుకే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ ఫారాలు నింపించాలి. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూడాలి” అని సూచించారు.ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన సీఎం, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎన్నికల అధికారులకు సరైన వివరాలు అందించడం అత్యంత కీలకమని అన్నారు.
చివరగా, ఈ నెల 30వ తేదీలోగా కొడంగల్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సార్ ప్రక్షాళన పూర్తి చేయాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా కోల్పోకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


