రూ.20 లక్షల రూపాయలు ఇంటి పన్ను ఎగవేత..
చర్యలు తీసుకోవాలని నాగోల్ డిప్యూటీ కమిషనర్ కు వినతి
ఎల్బీనగర్
ఎల్బీనగర్ పరిధిలోని కామినేని హాస్పిటల్ దగ్గరలో ఉన్న చిట్టిబాబు బిర్యానీ బిల్డింగ్కు ఇంటి నంబర్ (3-8-439) పిటీఐ నంబర్ 1030304120 కు సంబంధించి సుమారుగా రూ.20 లక్షల మేర ఇంటి పన్ను బకాయిలు/ఎగవేత ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలు ఇంటి పన్ను చెల్లించడంలో ఒక్క రోజు ఆలస్యం చేసినా నోటీసులు, జరిమానాలతో ఇబ్బందులు పెట్టే అధికారులు..ఇంత భారీ మొత్తంలో పన్ను బకాయిలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భవనం విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత నాగోల్ డిప్యూటీ కమిషనర్ స్పందించి ఇంటి పన్ను రికార్డులను సమగ్రంగా పరిశీలించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బకాయిలు ఉంటే వెంటనే వసూలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బిల్ కలెక్టర్ ఎటు పోయిండు…?
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వెనుక ఏమైనా కారణాలున్నాయా? లేక భారీ పన్ను బకాయిల విషయంలోనూ చూసీచూడనట్లు బిల్ కలెక్టర్ వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులయిన, రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నాగోల్ డిప్యూటీ కమిషనర్ వివరణ
చిట్టి బాబు బిర్యానీ భవన యజమాని పన్ను ఎగవేతపై నాగోల్ డిప్యూటీ కమిషనర్ ను వివరణ అడగగా, బకాయిలకు సంబంధించి యజమానికి నోటీసులు ఇచ్చామని, నోటీసులకు స్పందించకుంటే త్వరలో భవన సముదాయాన్ని స్వాధీన పరుచుకుంటామని తెలిపారు.


