ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు ధర్నా.. టి.యు.డబ్ల్యూ. జె.ఎఫ్ నాయకులు పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్:
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నెల 27వ తేదీన “ఛలో పార్లమెంట్” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) స్పష్టం చేసింది. బుధవారం హైదరాబాద్ హైదర్ గూడలోని న్యూస్ సర్వీస్ సిండికేట్ (ఎన్ఎస్ఎస్) కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ ప్రతినిధులు ఈ పోస్టర్ను ఆవిష్కరించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లను దేశ పాలకులు, పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిరసన కార్యక్రమం తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

*టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన డిమాండ్లు:
*రైల్వే రాయితీ పునరుద్ధరణ: కరోనా కాలంలో నిలిపివేసిన 50 శాతం రైలు ప్రయాణ చార్జీల రాయితీని తిరిగి పునరుద్ధరించాలి.
*జర్నలిస్టుల రక్షణ చట్టం:
విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను నిరోధించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలి.
*నేషనల్ మీడియా కమిషన్: విస్తరిస్తున్న మీడియా రంగానికి అనుగుణంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో “నేషనల్ మీడియా కమిషన్” ఏర్పాటు చేయాలి.
*జాతీయ పెన్షన్ పథకం: సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పిస్తూ దేశవ్యాప్తంగా ఒకే తరహా “జాతీయ పెన్షన్ పథకం” అమలు చేయాలి.
*డిజిటల్ మీడియాకు గుర్తింపు: ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాలకు పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలి.
*ఇళ్ల స్థలాల కేటాయింపు: పాత్రికేయ సంఘాలకు, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపుపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి, వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
*జంతర్ మంతర్ వద్ద విలేకరుల మహాధర్నా
ఈ డిమాండ్ల సాధనకై జూలై 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరసన ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రతినిధులతో పాటు, ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్’ (ఐఎఫ్డబ్ల్యూజే) జాతీయ నాయకులు, పలు రాష్ట్రాల జర్నలిస్టులు పాల్గొననున్నారు. ధర్నా అనంతరం కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు సమర్పించనున్నారు.
ఈ కార్యక్రమం జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు మైలురాయిగా నిలుస్తుందని, పాత్రికేయులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు.


