- అవయవ మార్పిడిపై పచ్చ పత్రికల విషపు ప్రచారం…
- ప్రజల్లో భయాందోళనలు సృష్టించే యత్నం… సంచలనాల కోసం దిగజారిన పత్రికా విలువలు
హైదరాబాద్:
రాష్ట్ర ప్రజారోగ్య రక్షణను మంటగలిపేలా, అత్యంత సున్నితమైన అవయవ దాన ప్రక్రియపై ‘దిశ’ దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా నిరాధారమైనది, పచ్చి అబద్ధాల పుట్ట. సమాజాన్ని తప్పుదోవ పట్టించే దుర్మార్గపు ఉద్దేశంతోనే ఈ వార్తను వక్రీకరించి ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వం 2014లోనే జారీ చేసిన నిబంధనలను, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత చట్టబద్ధమైన ప్రక్రియలో భాగంగా అమలు చేస్తుంటే… ఏదో కొత్తగా ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితానుమతులు ఇచ్చినట్లు చిత్రీకరించడం ఆ పత్రిక నైతిక దిగజారుడుతనానికి నిదర్శనం.
*చట్టం – చారిత్రక నేపథ్యం: వాస్తవాల నిగ్గు
మానవ అవయవాలు, కణజాలాల సేకరణ, నిల్వ, మార్పిడి ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, వాటి వాణిజ్య వ్యాపారాన్ని పూర్తిగా అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం 1994లోనే ‘మానవ అవయవాల మార్పిడి చట్టాన్ని’ తీసుకువచ్చింది. కాలక్రమేణా మారుతున్న అవసరాలకు అనుగుణంగా 2011లో దీనికి సవరణలు చేసి, కణజాలాలను కూడా పరిధిలోకి తెస్తూ దీన్ని ‘టీహెచ్ఓటీఏ’ (THOTA) చట్టంగా మార్చింది. దీనికి అనుగుణంగానే 2014 మార్చి 27న కేంద్రం సమగ్ర నిబంధనలను రూపొందించింది.
అయితే, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 2025 వరకు ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అడాప్ట్ చేసుకోకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించి, 2025 మార్చిలో అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. పాత రాష్ట్ర చట్టాన్ని రద్దు చేసి, కేంద్ర చట్టాన్ని రాష్ట్రంలో సంపూర్ణంగా అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే, నిబంధనల అమలు కోసం ఈ ఏడాది జూలై 1న అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్న ఈ గెజిట్ను ‘రహస్య జీవో’ అనడం విజ్ఞత గల ఎవరైనా హర్షిస్తారా?
*ఆసుపత్రి స్థాయి అనుమతి కమిటీలపై అబద్ధాల కోటలు:
ఏడాదికి 25 లేదా అంతకంటే ఎక్కువ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించే ఆసుపత్రులలో ‘ఆసుపత్రి ఆధారిత అనుమతి కమిటీ’ ఉండాలనే నిబంధన ఏ ఒక్కరోజూ కొత్తగా సృష్టించింది కాదు. ఇది నాటి 2014 కేంద్ర నిబంధనల్లోని రూల్ 11 స్పష్టంగా నిర్దేశించినదే. ఈ కమిటీ కేవలం ప్రైవేటు యాజమాన్యాల కనుసన్నల్లో నడిచేది కాదు. ఇందులో ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి లేదా ఆయన నామినేట్ చేసిన ఉన్నతాధికారి, ఆరోగ్య సంచాలకులు లేదా వారి ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, శస్త్రచికిత్సలతో సంబంధం లేని ఇద్దరు సీనియర్ వైద్యులు, సమాజంలో అత్యున్నత విశ్వసనీయత కలిగిన ఇద్దరు నిపుణులు ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తారు.
ప్రభుత్వ ప్రతినిధుల ప్రమేయం లేకుండా, కోరం పూర్తికాకుండా ఈ కమిటీ ఏ ఒక్క నిర్ణయాన్నీ తీసుకోలేదు. శస్త్రచికిత్సలో ప్రత్యక్షంగా పాల్గొనే ఏ ఒక్క వైద్యుడు కూడా ఈ అనుమతి కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు వీడే లేదు. ఆపరేషన్ చేసేవారే అనుమతులు ఇచ్చుకుంటున్నారంటూ ‘దిశ’ ప్రచారం చేస్తున్న అసత్యాలు ప్రజలను మోసం చేయడానికే తప్ప వేరు కాదు.
*బంధువులు కాని దాతలపై ఉక్కుపాదం… వాణిజ్య లావాదేవీలకు సంపూర్ణ నిషేధం
రక్తసంబంధం లేని దాతల విషయంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. దాతకు, గ్రహీతకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా? ఎవరైనా దళారులు ఉన్నారా? దాత కుటుంబ నేపథ్యం ఏమిటి? వారి మధ్య సంబంధాలు నిజమైనవేనా? అనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతారు. విదేశీ పౌరుల విషయానికి వస్తే, ఆయా దేశాల రాయబార కార్యాలయాల ధ్రువీకరణ తప్పనిసరి.
అవయవాల కొనుగోలు, విక్రయం, అక్రమ రవాణా, పేదల బలహీనతలను ఆసరాగా చేసుకుని చేసే దోపిడీలను ఈ చట్టం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. జీవో నెం.33 ద్వారా ఇలాంటి వాటికి ఎక్కడా ఎలాంటి వెసులుబాటూ కల్పించలేదు. అటువంటి అసాఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడమే ఈ చట్టపు పరమార్థం.
*పేదల మరణశాసనమంటూ నీచ రాజకీయాలు
సంచలనాత్మక శీర్షికలతో అభద్రతా భావాన్ని సృష్టించి, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దుర్మార్గపు ప్రచారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా ఖండిస్తోంది. తెలంగాణ గడ్డపై అవయవ దానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపార వస్తువుగా మార్చనివ్వబోమని, అత్యంత పారదర్శకంగా, నైతికంగా, నిబద్ధతతో ఈ వ్యవస్థను కాపాడుతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అవాస్తవాలను వక్రీకరించి రాసే పత్రికల తప్పుడు కథనాలను నమ్మవద్దని, ప్రజలు విచక్షణతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తోంది.


