- పరిపాలనలో అత్యాధునిక సాంకేతికతకు పెద్దపీట
- పౌరుల డేటా భద్రతకు బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీ
- గ్రామీణ ప్రాంతాలకూ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు
రాష్ట్రంలో డిజిటల్ పాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. త్వరలోనే ‘డిజిటల్ అసెంబ్లీ’, ‘డిజిటల్ కౌన్సిల్’ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ వేదికగా జరిగిన ‘ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. పౌర సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజల ముంగిటకే చేరవేయడమే లక్ష్యంగా కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), బ్లాక్‌చెయిన్ సాంకేతికత, డేటా విశ్లేషణ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను పాలనలో జోడిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

*డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికే రోల్ మోడల్
మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రభుత్వ పాలనలోనూ గుణాత్మక మార్పులు రావలసి ఉందన్నారు. ఇప్పటికే డిజిటల్ క్యాబినెట్, 20 ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తూ రియల్ టైమ్ గవర్నెన్స్ డ్యాష్‌బోర్డ్, దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్, వాట్సాప్ ద్వారా పౌర సేవలు, మీ-టికెట్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపామని మంత్రి స్పష్టం చేశారు.
*భద్రతకు పెద్దపీట: బ్లాక్‌చెయిన్ సర్టిఫికెట్లు
పౌరుల వ్యక్తిగత డేటాకు అత్యున్నత భద్రత కల్పించే లక్ష్యంతో త్వరలోనే బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారిత సర్టిఫికెట్ల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతానికి ‘టీ-ఫైబర్’ ద్వారా హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.
*ఇంటి ముంగిటకే పౌర సేవలు:
వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తొలగిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పౌర సేవలను నేరుగా వారి ఇంటి ముంగిటకే అందించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ‘డిజిటల్ ఆఫీస్’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని సమస్త ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో కాగిత రహిత (పేపర్‌లెస్) పాలనను అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేశామని పేర్కొన్నారు.
ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన ఆర్థిక సలహాదారు, మిత్రా సీఈవో ప్రవీణ్ పరదేశి, రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం ఎండీ జీవీఎల్ సత్య కుమార్, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో డాక్టర్ దేవేష్ త్యాగి, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అదనపు కార్యదర్శి సౌరభ్ కె. తివారీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



