Monday, October 12, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ ఫైర్ ఫైటర్స్ బతుకులు ఆగమాగం..!

తెలంగాణ ఫైర్ ఫైటర్స్ బతుకులు ఆగమాగం..!

  • అగ్నిమాపక శాఖలో జీవో 86 ఇబ్బందులు.. సీనియారిటీ కోల్పోయి రోడ్డున పడుతున్న ఫైర్ కానిస్టేబుళ్ల వ్యథ!
  • దశాబ్దాల సీనియారిటీ గల్లంతు.. జూనియర్ల కింద సీనియర్లు నలిగిపోతున్న వైనం
  • ప్రాణాపాయ విధుల్లో అనుభవం లేని డ్రైవింగ్ బలవంతం.. కుటుంబాలపై పడుతున్న కత్తి
  • సిబ్బంది మధ్య పెరుగుతున్న సమన్వయ లోపం.. ప్రాణాలకే ముప్పు తెస్తున్న నిబంధనలు

తెలంగాణ అగ్నిమాపక శాఖలో తెచ్చిన జీవో 86, ప్రాణాలను పణంగా పెట్టే ఫైర్ కానిస్టేబుళ్ల జీవితాల్లో చల్లారని ‘మంటలు’ రేపుతోంది! దశాబ్దాల అనుభవాన్ని గాల్లో కలిపేస్తూ, ఏళ్ల సీనియర్లను జూనియర్ల కింద మోకరిల్లేలా చేసిన ఈ నిబంధనలు ‘శాఖీయ సంస్కరణలు’ కావు… సిబ్బందికి వేసిన ‘ఫాసి శిక్షలు’! బీటెక్‌లు, పీజీలు చేసిన చేతులకు బలవంతపు డ్రైవింగ్ స్టీరింగ్ అప్పగించి, సర్వీస్ చివర్లో కంప్యూటర్ పరీక్షలంటూ వేధించడం అగ్నిమాపక శాఖ సాధిస్తున్న విచిత్ర ప్రగతి. ప్రజల ప్రాణాలు కాపాడే వీరులనే, తుగ్లక్ మార్గదర్శకాలతో దారుణంగా రోడ్డున పడేయడం శోచనీయం!

హైదరాబాద్

ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు క్షణాల వ్యవధిలో అగ్నిప్రమాద స్థలాలకు పరుగులు తీసే ఫైర్ సిబ్బంది జీవితాలు ప్రస్తుతం తీవ్ర అంధకారంలో కూరుకుపోతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన విధులను నిర్వర్తిస్తున్న ఫైర్ కానిస్టేబుళ్లకు తెలంగాణ అగ్నిమాపక శాఖలో ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 86 శాపంగా మారింది. ఉన్నత విద్యార్హతలు కలిగి, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు జరుగుతున్న ఈ అన్యాయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

*అగ్నిమాపక విధుల్లో తీవ్ర వివక్ష.. బలవంతపు డ్రైవింగ్ ఒత్తిడి
పీజీ, బీటెక్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగి, కేవలం పది ప్లస్ టూ అర్హతతో ఫైర్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరిన యువత అగ్నిప్రమాదాలను అరిచేందుకు అహర్నిశలు శమిస్తున్నారు. అయితే, వీరి ప్రధాన విధులతో సంబంధం లేని కార్యాలయ పనులు, కంప్యూటర్ పనులను అంటగట్టడమే కాకుండా, ఎన్నడూ డ్రైవింగ్ అనుభవం లేని వారిపై బలవంతంగా వాహనాలు నడపాలని అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. భారీ మోటార్ వాహన లైసెన్సు ఉంటేనే ఇంక్రిమెంట్లు ఇస్తామని, లేదంటే నిలిపివేస్తామని హెచ్చరించడం వారిని మానసిక వేదనకు గురిచేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తగిన శిక్షణ లేకుండా వాహనాలు నడిపి పొరపాట్లు జరిగితే, ఆ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని సిబ్బంది కన్నీరుమున్నీరవుతున్నారు.

*తలకిందులైన ప్రమోషన్ ఛానల్.. దశాబ్దాల సీనియారిటీ గాలికి:
జీవో 86 రాకముందు ఫైర్ కానిస్టేబుళ్ల పదోన్నతుల మార్గం అత్యంత స్పష్టంగా ఉండేది. ఫైర్ ఫైటర్ నుంచి లీడింగ్ ఫైర్ ఫైటర్ (హెడ్ కానిస్టేబుల్)గా, అక్కడి నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ప్రమోషన్లు లభించేవి. కానీ, ఈ జీవో వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫైర్ ఫైటర్ నుంచి ‘ఫైర్ ఫైటర్ టెక్నికల్’ (డ్రైవర్ ఆపరేటర్)గా మారిన తర్వాతే లీడింగ్ ఫైర్ ఫైటర్‌గా ప్రమోషన్ ఇవ్వాలనే నిబంధన తెచ్చారు.
దీనివల్ల 1986, 1991, 1993 సంవత్సరాల్లో ఫైర్ ఫైటర్లుగా నియామకమైన సీనియర్లు సైతం దశాబ్దాలు గడిచినా ఇంకా లీడింగ్ ఫైర్ ఫైటర్లుగానే మగ్గిపోతున్నారు. మరో రెండు మూడు ఏళ్లలో రిటైర్మెంట్ ఉన్నవారికి సైతం హెవీ వెహికల్, కంప్యూటర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. మరోవైపు, 2011 బ్యాచ్‌లో వచ్చిన వారు నేరుగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందగా, వారికి దశాబ్దానికి పైగా సీనియరైన 1986, 1991 బ్యాచ్ సిబ్బంది వారి కింద జూనియర్లుగా మారాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అనుభవం లేని కొత్త డ్రైవర్ ఆపరేటర్లు కొద్ది నెలల్లోనే ప్రమోషన్లు పొందుతుండగా, ఏళ్ల తరబడి సేవ చేసిన అనుభవజ్ఞులు కిందిస్థాయిలోనే ఉండిపోవడం తీవ్ర అన్యాయమని సిబ్బంది వాపోతున్నారు.

*గ్రౌండ్‌లో సమన్వయం కరువు.. ప్రాణాలకే ప్రమాదం:
అగ్నిమాపక శాఖలో ఫైర్ ఫైటర్, డ్రైవర్ ఆపరేటర్ ఇద్దరూ ఒకే రెస్క్యూ బృందంలో రెండు కళ్ల లాంటివారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాహనం వేగంగా చేరుకోవడం, పంప్ ఆపరేషన్, హోస్ లైన్ల ఏర్పాటు, మంటల్లోకి చొచ్చుకెళ్లడం వంటి ప్రతి దశలోనూ ఇద్దరి మధ్య అన్యోన్యత, నమ్మకం ఉండాలి. ఇంట్లో కంటే ఎక్కువ సమయం ఫైర్ స్టేషన్‌లోనే సహచరులతో గడిపే ఈ సిబ్బంది మధ్య, ఈ జీవో కారణంగా అనవసరమైన విభేదాలు, అస్పష్టతలు తలెత్తుతున్నాయి.
ప్రతి అగ్నిప్రమాదం భిన్నంగా ఉంటుందని, ఫైర్ ఫైటింగ్ అంటే కేవలం నీళ్లు కొట్టడం కాదని అనుభవజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి క్లిష్టమైన సమయాల్లో సిబ్బంది మధ్య సమన్వయం దెబ్బతింటే, అది నేరుగా సంఘటనా స్థలంలో ప్రాణాపాయానికి దారితీసే ముప్పుంది.

*తక్షణమే స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి:
ప్రజల ప్రాణాలను కాపాడే రక్షకుల మధ్యే అంతర్గత విభేదాలకు కారణమవుతున్న జీవో నంబర్ 86ను ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలి. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న ఈ నిబంధనలను సవరించి, సీనియారిటీని, ప్రమోషన్ మార్గాలను, ఫైర్ సిబ్బంది ఉద్యోగ భద్రతను కాపాడాలని బాధితులు మనస్ఫూర్తిగా కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments