Friday, August 14, 2026
Google search engine
Homeతెలంగాణబడంగ్పేట్‌లో అధికారుల అండతో అక్రమ గిడ్డంగుల సామ్రాజ్యం!

బడంగ్పేట్‌లో అధికారుల అండతో అక్రమ గిడ్డంగుల సామ్రాజ్యం!

  • నిబంధనలకు తిలోదకాలు.. శాస్త్రీయ కోణంలో ముప్పు పొంచి ఉన్నా స్పందించని యంత్రాంగం..
  • శంషాబాద్ జోనల్ ఎస్.టి.ఎఫ్ ఇంచార్జ్ మెహర ఏం చేస్తున్నట్లు..?
  • జిహెచ్ఎంసి విజిలెన్స్ అధికారులు, హైడ్రా అగ్నిమాపక అధికారులు, ఏం చేస్తున్నట్లు..?
  • జోనల్ కమిషనర్ చంద్రకళ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ దృష్టి సారించాలి..!

బడంగ్పేట్ మున్సిపాలిటీ అవినీతికి కీరఫ్ అడ్రస్ గా గతంలో పదిమంది అధికారులు సస్పెండ్ అయినా కూడా తీరుమారని వర్క్ స్టైల్..!, రూ కోట్ల ప్రజాధనం లూటీ.. పదుల సంఖ్యలో గ్రామపంచాయతీ లేఔట్లు, వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు, బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారా, ప్రజాధనం మున్సిపల్ ఖజానాకు చేరవలసిన పన్నులు సొంత జేబుల్లోకి మరల్చుకుంటున్నారా ..? ప్రజల ఫిర్యాదులపై దరఖాస్తులపై నెలలు గడిచిన చర్యలు శూన్యం.. స్పందించని యంత్రాంగం, మున్సిపల్ చట్టాలు మాకు వర్తించవు అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు.. ఈ విషయంపై ఉన్నత వర్గాలు నిఘా విభాగాలు దృష్టి సారించాలంటూ.. స్థానిక ప్రజల డిమాండ్..

బడంగ్పేట్:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే స్వయంగా అక్రమార్కులకు కొమ్ముకాయడంతో, నిబంధనలకు విరుద్ధంగా భారీ గిడ్డంగులు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జరుగుతున్న ఈ బాగోతంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా, బాధ్యులైన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

*చట్టాన్ని శాసించే స్థాయికి అక్రమార్కులు
“అధికారులకు మామూళ్లు ముట్టచెబితే ఏ చట్టమైనా మాకే చుట్టం” అనే రీతిలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ సర్కిల్-16 కార్యాలయానికి అభిముఖంగా, ప్రధాన రహదారుల వెంట వందలాది సంఖ్యలో భారీ గిడ్డంగులు, వాణిజ్య నిర్మాణాలు వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ తదితర సమర్థ శాఖల నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు పొందకుండానే దందాలు సాగుతున్నాయి. గతంలో వెలువడిన హెచ్చరికలను, ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతుండటం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనం.

*శాస్త్రీయ లోపాలు – ప్రజల ప్రాణాలకే ముప్పు
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భారీ గిడ్డంగుల వల్ల తీవ్రమైన శాస్త్రీయ, భద్రతాపరమైన ముప్పు పొంచి ఉంది:

  • అగ్నిప్రమాదాల విస్ఫోటనం: ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, అగ్నిమాపక యంత్రాలు లేకపోవడం వల్ల ఏ క్షణంలోనైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే చుట్టుపక్కల నివాస ప్రాంతాలు బూడిదయ్యే ప్రమాదం ఉంది. గతంలో అనేక నగరాల్లో జరిగిన అగ్నిప్రమాదాల ఉదంతాలు కళ్ళముందు కదలాడుతున్నా యంత్రాంగంలో చలనం లేదు.
  • రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం: ప్రధాన రహదారులపై భారీ కంటైనర్లు, లారీలను నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనివల్ల పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • ప్రభుత్వ ఖజానాకు భారీ గండి: కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆదాయం (భవన నిర్మాణ అనుమతి రుసుములు, జీఎస్టీ తదితర పన్నులు) అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుండగా, మున్సిపల్ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది.

*అధికారుల ఉదాసీనతకు బలవుతున్న ప్రజాశ్రేయస్సు
స్థానిక ప్రజలు రాతపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది. ఈ అక్రమాలకు ప్రధానంగా కింది అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది:

  • బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య
  • టౌన్ ప్లానింగ్ ఏసీపీ కళ్యాణ చక్రవర్తి
  • టీపీఎస్ సాయి
    వీరి పర్యవేక్షణ లోపం వల్లే అక్రమాలు రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో వచ్చిన వార్తా కథనాలపై స్పందించకుండా, కనీస విచారణ కూడా చేపట్టకపోవడం అధికారుల బాధ్యతరాహిత్యానికి పరాకాష్ట.

*ఉన్నతాధికారుల తక్షణ జోక్యం అవసరం..
ఇంత అవినీతి జరుగుతున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శంషాబాద్ జోన్ సిటీ ప్లానర్ మెహరా ఏం చేస్తున్నట్లు..?
ఇప్పటికైనా జోనల్ కమిషనర్ చంద్రకళ, జీహెచ్ఎంసి కమిషనర్ మరియు ఆర్వీ కర్ణన్ తక్షణమే ఈ వ్యవహారంపై దృష్టి సారించాలి. బడంగ్పేట్ మున్సిపాలిటీలో సాగుతున్న అక్రమ గిడ్డంగులపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోదాములను తక్షణమే సీజ్ చేయాలి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులతో పాటు, వారికి సహకరిస్తున్న అవినీతి అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ‘భారత శక్తి’ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments