డిసెంబర్ 11 నుంచి 22 వరకు అట్టహాసంగా ‘ఖేలో ఇండియా’ మహా సంగ్రామం!
- కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన తెలంగాణ క్రీడా ప్రతినిధుల బృందం
- రాష్ట్ర ప్రభుత్వ నూతన క్రీడా విధానంపై ప్రశంసల జల్లు..
*నిర్వహణకు సంపూర్ణ మద్దతునిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ
దేశ క్రీడా యవనికపై నవశకానికి నాంది పలుకుతూ, నూతన తెలంగాణ రాష్ట్ర సత్తాను విశ్వవ్యాప్తం చేసే చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక ‘ఖేలో ఇండియా’ క్రీడా మహాోత్సవాల నిర్వహణకు తెలంగాణ గడ్డ వేదికవుతుండగా, ఈ క్రీడా కురుక్షేత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా అఖండ విజయవంతం చేస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గర్జించారు.
గురువారం నాడు న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ కె. శివసేన రెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా, రాష్ట్ర క్రీడా భవిష్యత్తును నిర్దేశించే మైలురాయిగా నిలిచింది.

*ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర ఆహ్వానం:
తెలంగాణకు ఖేలో ఇండియా క్రీడలను కేటాయించి, రాష్ట్ర యువతపై అపారమైన నమ్మకం ఉంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా రాసిన అధికారిక ఆహ్వాన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు.
రాబోయే డిసెంబర్ 11 నుంచి 22 వరకు సరిగ్గా 12 రోజుల పాటు అద్భుతరీతిలో ఈ క్రీడా పండుగను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ మహా క్రీడల ప్రారంభోత్సవ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే సమయం కోరనున్నట్లు వెల్లడించారు.
*విప్లవాత్మక నిర్ణయాలతో క్రీడా వికాసం: మంత్రి శ్రీహరి
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మంత్రి శ్రీహరి జాతికి చాటిచెప్పారు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిక్షిప్తమై ఉన్న అణగారిన ప్రతిభను వెలికితీసేలా విప్లవాత్మకమైన నూతన క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
“నిర్వహణలో ఏ చిన్న లోపానికి, విమర్శలకు తావులేకుండా అత్యున్నత జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఖేలో ఇండియా పోటీలను నిర్వహిస్తాం. అందరి సమష్టి కృషితో తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలను దశదిశలా చాటుతాం.”
— వాకిటి శ్రీహరి, తెలంగాణ క్రీడాశాఖ మంత్రి
*శాస్త్రీయ దృక్పథంతో ఏర్పాట్లు:
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మౌలిక క్రీడా వసతులను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతినిధి బృందం కేంద్ర మంత్రికి వివరించింది. క్రీడాకారుల శారీరక, మానసిక దారుఢ్యాన్ని పెంచేలా శాస్త్రీయ శిక్షణ పద్ధతులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలంగాణ ప్రభుత్వ సన్నాహకాలను అభినందిస్తూ, కేంద్రం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. ఈ మహా వేడుకతో తెలంగాణ క్రీడా రరంగం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడం తథ్యమని క్రీడా వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.



