Thursday, August 20, 2026
Google search engine
Homeతెలంగాణబాలికల అక్రమ రవాణా రాక్షసులకు కఠిన శిక్షలు!

బాలికల అక్రమ రవాణా రాక్షసులకు కఠిన శిక్షలు!

  • ఐదుగురికి జీవిత ఖైదు.. ముప్పై ముగ్గురు కామాంధులకు ఊచల వెనుక జీవితం
  • సీఐడీ ఉక్కుపాదం.. తొమ్మిది మంది బాధితులకు యాభై ఐదు లక్షల పరిహార భరోసా

హైదరాబాద్‌

సమాజ సిగ్గుపడేలా పసిప్రాయపు బాలికలను అక్రమ రవాణా చేసి, కామ క్రీడలకు బలిచేసిన దుర్మార్గులపై న్యాయస్థానం ఉక్కుపాదం మోపింది. అభం శుభం తెలియని పసికూనలను ఉద్యోగాల పేరుతో నమ్మించి, వ్యభిచార కూపంలోకి నెట్టిన అమానుష కాండలో దోషులుగా తేలిన ముప్పై ముగ్గురు రాక్షసులకు కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. సీఐడీ మహిళా భద్రత విభాగం చేపట్టిన శాస్త్రీయ, సమగ్ర దర్యాప్తు బలంతో హకా భవన్‌లోని పోక్సో ప్రత్యేక సెషన్స్‌ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.

ఉద్యోగాల గాలం.. రాక్షస క్రీడల లోకం

వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద బాలికకు ఉపాధి చూపుతామంటూ నమ్మబలికిన కిరాతకులు, ఆమెను దళారులకు విక్రయించారు. అప్పటి నుంచి సుమారు నాలుగు నెలల పాటు నిర్బంధించి, నిరంతరం శారీరక, మానసిక హింసకు గురిచేశారు. నిందితుల అరాచకాలను ఎదిరించలేక కుమిలిపోయిన ఆ బాధితురాలు, చాకచక్యంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారి చెరనుంచి తప్పించుకుంది. నేరుగా సీఐడీ కార్యాలయానికి చేరుకుని కన్నీటి పర్యంతమవుతూ తన గోడు వెళ్లబోసుకుంది.

శాస్త్రీయ దర్యాప్తు.. పక్కా ఆధారాల సేకరణ

బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన సీఐడీ అధికారులు రంగంలోకి దిగి, రాష్ట్రవ్యాప్తంగా వ్యభిచార గృహాలపై మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో నూతన జీవితాన్ని చూడాల్సిన తొమ్మిది మంది మైనర్‌ బాలికలను రక్షించి విముక్తి కల్పించారు. డీఎస్పీలు సురేశ్‌బాబు, కె. శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ కె. బాలరాం రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు బృందం ఫోరెన్సిక్, డిజిటల్, సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించింది. ప్రభుత్వ న్యాయవాది మరెల్ల రమాదేవి వాదనల జోరుకు నిందితుల తరఫు వాదనలు నిలవలేకపోయాయి.

శిక్షల మోత.. ఊచల వెనుకకు కామాంధులు

కేసును సమగ్రంగా విచారించిన ప్రత్యేక సెషన్స్‌ న్యాయమూర్తి శ్రీ ఉదయ్‌ భాస్కర్‌రావు, నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ కఠిన శిక్షలు ఖరారు చేశారు.

ఐదుగురు కిరాతకులకు జీవిత ఖైదు.

ముగ్గురికి పద్నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష.

పద్నాలుగు మందికి దశాబ్ద కాలం (10 ఏళ్లు) పాటు జైలు శిక్ష.

పదకొండు మందికి మూడేళ్ల కఠిన శిక్ష.

బాధితులకు ఆర్థిక భరోసా.. పరిహార వర్షం

నిందితుల పైశాచికత్వం వల్ల జీవితాంతం మానసిక క్షోభ అనుభవించనున్న తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 45 లక్షల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుందని, నేరస్థులకు కఠిన శిక్షలు ఖాయమనే నమ్మకాన్ని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందని సీఐడీ మహిళా భద్రత విభాగం స్పష్టం చేసింది.

“అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకునే మృగాళ్లకు సమాజంలో నూకలు చెల్లాయి. శాస్త్రీయ దర్యాప్తు, పకడ్బందీ ప్రాసిక్యూషన్‌ ఉంటే నేరస్థులు ఎంతటివారైనా శిక్ష అనుభవించక తప్పదని ఈ తీర్పు నిరూపించింది.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments