- ఎన్సీఆర్బీ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు.. ఏడాదిలో 46 శాతం పెరిగిన బాల్య నేరాలు
- వాట్సాప్, సోషల్ మీడియా ఆధారాలు ట్యాంపరింగ్‌కు అతీతం కాదు: డాక్టర్ హెరాల్డ్ డి కోస్టా
- డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు రక్షణ కవచం ఏర్పాటు కావాలి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్
భారత శక్తి:
దేశంలో సాంకేతిక విప్లవం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, మరోవైపు డిజిటల్ నేరాలు ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నల్సా సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్ రెండో రోజు సాంకేతిక సదస్సులో దేశ అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రముఖ సైబర్ నిపుణులు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ సాక్ష్యాల ప్రామాణికతపై సంచలన విషయాలు వెల్లడించడంతో పాటు, చట్టాలలో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతూ పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
*డిజిటల్ ఆధారాలు ట్యాంపరింగ్‌కు అతీతం కాదు: డాక్టర్ హెరాల్డ్ డి కోస్టా
సైబర్ సెక్యూరిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ హెరాల్డ్ డి కోస్టా మాట్లాడుతూ.. వాట్సాప్ వంటి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా తారుమారుకు అతీతం కాదనే కఠిన సత్యాన్ని బయటపెట్టారు. సమావేశంలో ప్రత్యక్ష ప్రదర్శన (లైవ్ డెమో) ద్వారా దీనిని నిరూపించారు.
- వాట్సాప్‌లో పంపిన చిత్రానికి, అందిన చిత్రానికి మధ్య పూర్తి వ్యత్యాసం ఉంటుందని, అలాగే ‘ఉచితం’ అనే పదం గమ్యస్థానానికి చేరేసరికి ‘రుసుముతో కూడినది’గా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
- ప్రాథమిక మూలాన్ని పరిశీలించకుండా డిజిటల్ ఆధారాలను గుర్తిస్తే దర్యాప్తు పూర్తిగా పక్కదారి పడుతుందని స్పష్టం చేశారు.
- సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ కాపీ చేసే ముందే మూల వీడియో ట్యాంపరింగ్ జరిగిందా లేదా పరిశీలించాలని, కేవలం స్క్రీన్షాట్లను గుడ్డిగా నమ్మరాదని స్పష్టం చేశారు.
- పోక్సో కేసుల్లో ప్రింటవుట్లపై ఆధారపడకుండా, ఒరిజినల్ డివైజెస్‌ను మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపాలని సూచించారు.
*బాల్య రక్షణ కేవలం నాలుగు గోడలకే పరిమితం కాదు: జస్టిస్ విక్రమ్ నాథ్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రసంగిస్తూ.. నేడు డిజిటల్ ప్రపంచం చిన్నారి జీవితంలో అంతర్భాగంగా మారినందున, సమాజ రక్షణ బాధ్యత సైబర్ ప్రపంచానికి కూడా విస్తరించాలని ఉద్ఘాటించారు.
- ఇంటర్నెట్ ఎన్నో అవకాశాలను తెచ్చినప్పటికీ, ఆన్లైన్ గ్రూమింగ్, సైబర్ స్టాకింగ్, నకిలీ ప్రొఫైళ్లు, వ్యక్తిగత చిత్రాల వ్యాప్తి, లైంగిక వేధింపుల సమాచారం (CSAM) వంటి ముప్పులు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించే నకిలీ చిత్రాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
- కేవలం క్రిమినల్ చట్టాల ద్వారానే కాకుండా, కుటుంబాలు, పాఠశాలలు, సమాజం, సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌ల సమన్వయంతోనే బాల్య రక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బాధితులైన పిల్లలకు కౌన్సెలింగ్, వైద్య సేవలు, పునరావాస చర్యలు దీర్ఘకాలంగా అందించాలని కోరారు.
*46 శాతం పెరిగిన చిన్నారులపై నేరాలు: నీరజ్ వర్మా
భారత ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి నీరజ్ వర్మా జాతీయ గణాంకాలను సదస్సు ముందుంచారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తం నేరాలు తగ్గినప్పటికీ, చిన్నారులపై జరుగుతున్న నేరాల నమోదులో 46 శాతం భారీ పెరుగుదల నమోదైందని వెల్లడించారు.
- నమోదైన సైబర్ నేరాలలో 89 శాతం నేరాలు చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించినవేనని, పోక్సో కేసులలో 96.6 శాతం మంది నిందితులు బాధితులకు ముందే పరిచయమున్నవారేనని పేర్కొన్నారు.
- దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాలలో 66.4 శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపారు.
- ఏఐ మరియు డీప్‌ఫేక్స్ ద్వారా అసలు చిన్నారి లేకుండానే రూపొందించే సింథటిక్ లేదా మార్ఫింగ్ లైంగిక చిత్రాలపై చట్టాలలో స్పష్టమైన శిక్షా నిబంధనలు లేకపోవడం పెద్ద లోపమని ఆందోళన వ్యక్తం చేశారు.
- చిన్నారుల రక్షణ కోసం అన్ని పోర్టళ్లను ఏకీకృతం చేస్తూ ‘ఒకే జాతీయ సైబర్ పోర్టల్’ను ఏర్పాటు చేయాలని, అత్యవసర హెల్ప్లైన్లను సమన్వయం చేయాలని ప్రతిపాదించారు.



