- నిజాం నవాబుల ఊడిగంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలకుల నీచ రాజకీయాలు!
- రజాకార్ల వారసుల కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వాల ముసుగు పాలన!
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అప్రతిహతంగా జరుగనున్న విముక్తి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు..
తెలంగాణ గడ్డపై రజాకార్ల పైశాచిక కాండను విస్మరిస్తూ, మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో పాలకుల ఊడిగం చేయడం అక్షరాలా ఆత్మద్రోహమే! నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను తుచ్ఛ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తాకట్టు పెట్టాయి. పక్క రాష్ట్రాలు ఘనంగా విముక్తి వేడుకలు జరుపుతుంటే, పురిటిగడ్డపైనే ఇక్కడి పాలకులు భయపడి పారిపోవడం సిగ్గుచేటు. చరిత్రను వక్రీకరిస్తూ మజ్లిస్ కాళ్లడడుగుల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది!
హైదరాబాద్:
తెలంగాణ ప్రజల నరనరాల్లో నిండిన రజాకార్ల వ్యతిరేక పోరాట స్ఫూర్తిని అధికారికంగా విస్మరిస్తూ, మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో పయనిస్తున్న రాష్ట్ర పాలకులపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వెనుకడుగు వేయడం అక్షరాలా అమరవీరుల త్యాగాలను తాకట్టు పెట్టడమేనని ఆయన ధ్వజమెత్తారు.
భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి నుండి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన జెండా పతాక ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’ అఖండ విజయవంతమైంది. స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొని శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. అనంతరం సర్దార్ పటేల్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
*చరిత్రను వక్రీకరిస్తున్న పాలకుల ద్రోహం:
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల పైశాచిక కాండకు వ్యతిరేకంగా తెలంగాణ ఆడబిడ్డలు రోకలిబండలు, కారపు ముద్దలతో రణరంగాన్ని తలపించారని, గ్రామ సరిహద్దుల దాకా వారిని తరిమికొట్టిన వీరోచిత చరిత్ర మనదన్నారు. హిందువుల ఆస్తులను లూటీ చేస్తూ, జాతీయ జెండా ఎగరేసినవారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన రజాకార్ల దురాగతాలను నేటి పాలకుల తుచ్ఛ రాజకీయాల కోసం మరుగున పరుస్తున్నారని దుయ్యబట్టారు.
సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో అక్కడి ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటే… నిజాం వ్యతిరేక పోరాట పురిటిగడ్డ అయిన హైదరాబాద్‌లోనే ఇక్కడి ప్రభుత్వాలు భయపడి పారిపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మజ్లిస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి, గత పదేళ్లు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని మజ్లిస్ కాళ్ళడడుగుల్లో పెట్టాయని తీవ్రంగా విమర్శించారు.
*కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని’ అధికారికంగా నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు జరిగే ఈ చారిత్రక వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అమరులకు నివాళులర్పిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, తెలంగాణ గవర్నర్ గారు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు. త్రివిధ దళాల సైనిక కవాతు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలు ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రాణాలర్పించిన వీరుల రుణం తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరేడ్ గ్రౌండ్స్ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




