Saturday, November 7, 2026
Google search engine
Homeతెలంగాణమియాపూర్ 100 సర్వే నంబర్‌లోని ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ పేద ప్రజల నివాసాలకు...

మియాపూర్ 100 సర్వే నంబర్‌లోని ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ పేద ప్రజల నివాసాలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి….

  • మియాపూర్ 100, 101 సర్వే నంబర్లలోని మిగులు ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి…
  • శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా లో యంసిపిఐ(యు) డిమాండ్….

  • శేరిలింగంపల్లి :
    మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 100 పరిధిలో ఉన్న ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ బస్తీలలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని, సర్వే నంబర్లు 100, 101లోని మిగులు ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తూ, యంసిపిఐ(యు) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తూ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ మాట్లాడుతూ, మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తామని ప్రకటించడం ప్రజా అవసరాలకు తీరని ద్రోహమని విమర్శించారు.

గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను విక్రయిస్తూ పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన భూములను రియల్ ఎస్టేట్ శక్తులకు అప్పగిస్తూ ప్రజా పాలన చేస్తున్నామని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ భూములు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాల్సింది పోయి, పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసం స్వాహా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మియాపూర్ గ్రామ సర్వే నంబర్ 100లో గత 30 సంవత్సరాలకు పైగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేద ప్రజలు 68 గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లకు చట్టబద్ధత కల్పించి ఇంటి పట్టాలు ఇవ్వాలని, జీవో నంబర్లు 505, 166, 58 కింద ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

గత టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అనేక సాకులు చెబుతూ పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేశాయని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టాల జారీ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని, వెంటనే నిర్ణయం తీసుకొని ఇంటి పట్టాలు జారీ చేయవచ్చని అన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు, ప్రభుత్వ భూముల విక్రయాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ బస్తీలలో నివసిస్తున్న పేద ప్రజలకు వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని, సర్వే నంబర్లు 100, 101లోని మిగులు ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ భూములను విక్రయించేందుకు ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాల ద్వారా తగిన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అనంతరం యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ, సర్వే నంబర్లు 100, 101లోని ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, డిగ్రీ కళాశాల, 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, జూనియర్ కళాశాల, మినీ స్టేడియం, మార్కెట్ యార్డు తదితర ప్రజా అవసరాలకు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ భూమిని విక్రయించేందుకు ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కుంభం సుకన్య, తాండ్ర కళావతి, వి. తుకారాం నాయక్, పి భాగ్యమ్మ,కర్ర దానయ్య, ఇస్లావత్ దశరత్ నాయక్ తదితరులు పాల్గొని ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు.

అలాగే కమిటీ సభ్యులు జి. శివాని, లలిత, నిమ్మక నాగభూషణం, ఎం.డి. సుల్తానా బేగం, బి. అరుణ, డప్పు రాజు, రాములు, కే మాధవ ,అమీనా బేగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments