Tuesday, September 8, 2026
Google search engine
Homeతెలంగాణముందు హత్యలు చేయండి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి రండి’..

ముందు హత్యలు చేయండి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి రండి’..

  • ఆప్‌లో గ్యాంగ్‌స్టర్‌ చేరడంపై సిద్ధూ మూసేవాలా తండ్రి విమర్శలు..
  • అసెంబ్లీకి వెళ్లాలంటే ముందే హత్యలు చేయాలా?
  • గ్యాంగ్‌స్టర్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న అధికార పార్టీ..
  • రానున్న ఎన్నికల్లో నేరస్తుల రాజ్యమేలే ప్రమాదం

చండీగఢ్:
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజకీయాల్లోకి నేరగాళ్ల ప్రవేశం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. అధికార పీఠాన్ని దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీలు నైతిక విలువలను పూర్తిగా గాలికి వదిలేశాయి. ఇందులో భాగంగానే పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పెద్దపీట వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. హత్యకు గురైన ప్రముఖ పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఈ పరిణామాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేరగాళ్లకు ప్రధాన రాజకీయాల్లో చోటు కల్పిస్తూ రాష్ట్రాన్ని అరాచక వైపు నడిపిస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.
మాన్సాలో నిర్వహించిన ఒక బహిరంగ సమావేశంలో బల్కౌర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై నిలదీశారు. రాజకీయాల్లో ప్రజాసేవకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల హవా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ముందుగా రెండు, మూడు హత్యలు చేయండి.. ఆ తర్వాత నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టండి” అంటూ ఆప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎద్దేవా చేశారు.

*నేర సామ్రాజ్యానికి రాజమార్గం:
2016 నాభా జైలు బద్దలు కొట్టి పరారైన ఘటనలో ప్రధాన నిందితుడిగా, గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నేతగా మారిన గుర్‌ప్రీత్ సింగ్ సెఖోన్‌ను ఆప్‌లో చేర్చుకోవడం పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఫిరోజ్‌పూర్ జిల్లా జిరాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ఈ గ్యాంగ్‌స్టర్‌ను పార్టీలోకి ఆహ్వానించడం సమాజంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిరా నియోజకవర్గం నుంచి సెఖోన్‌ను బరిలోకి దించేందుకు ఆప్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రచారానికి కూడా సిద్ధమయ్యారు.

సామాజిక విశ్లేషకులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లుగా.. రాజకీయాల్లోకి నేరగాళ్ల ప్రవేశం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా కుదిపేస్తోంది. క్రిమినాలజీ మరియు రాజకీయ శాస్త్ర అధ్యయనాల ప్రకారం, నేరస్థులకు చట్టసభల్లో చోటు కల్పించడం వల్ల సమాజంలో హింస, భయానక వాతావరణం విపరీతంగా పెరుగుతాయి. ఇది వ్యవస్థీకృత నేరాలకు (Organized Crime) చట్టబద్ధత కల్పించినట్లవుతుందని, తద్వారా పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కరవవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

*అసెంబ్లీకి ప్రజాప్రతినిధులా? లేక హంతకుల సమూహమా?
రాబోయే ఎన్నికల్లో సుమారు పదిహేను మంది గ్యాంగ్‌స్టర్లు రాజకీయ రంగప్రవేశం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని బల్కౌర్ సింగ్ అంచనా వేశారు. ఇదే కనుక జరిగితే 2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత హింసాత్మకంగా, రక్తపాతంతో కూడుకున్నవిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.
నేరగాళ్లను చట్టసభలకు పంపాలా లేక ప్రజా సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ప్రజల హక్కుల కోసం నిజాయితీగా పోరాడే సమర్థులైన ప్రతినిధులను ఎన్నుకోవాలా అనేది ఇప్పుడు పంజాబ్ ప్రజల ముందున్న అత్యంత కీలకమైన ప్రశ్న. రాజకీయాల్లో నేరపూరిత శక్తుల జోక్యాన్ని ఇప్పుడే కట్టడి చేయకపోతే, రేపటి తరం భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని బల్కౌర్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments