Wednesday, October 14, 2026
Google search engine
Homeతెలంగాణరేషన్ కార్డుల జారీలో దళారుల దందా.. డీలర్ల పంథా!

రేషన్ కార్డుల జారీలో దళారుల దందా.. డీలర్ల పంథా!

  • అర్హులైన పేదల అగచాట్లు.. అధికారుల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు
  • డబ్బులిస్తేనే అప్రూవల్.. సివిల్ సప్లయ్ శాఖలో విచ్చలవిడిగా అక్రమ వసూళ్లు
  • రాజేంద్రనగర్ కేంద్రంగా సాగుతున్న దందాలపై సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్.

రేషన్ కార్డు కావాలంటే అర్హత ఉంటే సరిపోదు.. దళారుల జేబులు నింపే తాహతు ఉండాలి! పేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన సివిల్ సప్లయ్ శాఖ, ఇప్పుడు ‘మామూళ్ల’ సరఫరా శాఖలా మారిపోయింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులు ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతుంటే, డీలర్లకు, అధికారులకు కాసులు సమర్పించుకున్న ‘ఘనులకు’ మాత్రం రాత్రికి రాత్రే కార్లు, కార్డులు వెలిసిపోతున్నాయి. రాజేంద్రనగర్ వేదికగా సాగుతున్న ఈ నయా దోపిడీ పర్వంపై ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హైదరాబాద్

పేద, మధ్యతరగతి, అంగ వైకల్య ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాల్సిన పవిత్రమైన రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అవినీతి తంతు శ్రుతి మించుతోంది. అర్హత ఉండి అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ, సామాన్యులకు నెలల తరబడి నిరీక్షణే మిగులుతుండగా.. దళారులు, రేషన్ డీలర్ల చేతిలో నగదు తలపెడితే మాత్రం దరఖాస్తులు ఇట్టే ఆమోదం పొందుతున్నాయనే తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

కార్యాలయాల చుట్టూ పేదల ప్రదక్షిణలు:
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందడానికి అత్యంత కీలకమైన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అధికారులు మరియు కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్నప్పటికీ, నెలల తరబడి వేచి చూడాల్సిన దైన్యం నెలకొంది. మరోవైపు, ఇదే అదునుగా భావిస్తున్న కొందరు రేషన్ డీలర్లు సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో కుమ్మక్కై అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అక్రమ వసూళ్ల పర్వం వెనుక ఎవరు?
డబ్బులు చెల్లించిన వారికే కార్డుల ఆమోదం లభిస్తోందనే ప్రచారం పేదల మధ్య కలకలం రేపుతోంది. పేదల బలహీనతలను, అత్యవసరాలను ఆసరాగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరులో డీలర్ల పాత్ర ఏమిటి? తెరవెనుక సాగుతున్న ఈ వసూళ్ల పర్వంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఎంత ఉందనే కోణంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తక్షణమే స్పందించాలని ప్రజా డిమాండ్:
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ పథకాల అమలులో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా కార్డులు మంజూరు చేయాలని, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలితే బాధ్యులైన ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments